Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగుల్లో లివర్ ఇష్యూస్.. ఎంత ఎక్కువో చెప్పిన తాజా సర్వే

హెచ్ సీయూ పరిశోధకులు చేపట్టిన ఈ సర్వే ఫలితాలు ఆందోళనకు గురి చేసేలా.. ఐటీ ఉద్యోగులు తక్షణం తమ ఆరోగ్యం మీద ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పేశాయని చెప్పాలి.

By:  Tupaki Desk   |   26 Feb 2025 4:57 AM GMT
ఐటీ ఉద్యోగుల్లో లివర్ ఇష్యూస్.. ఎంత ఎక్కువో చెప్పిన తాజా సర్వే
X

హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయ విద్యార్థులు తాజాగా నిర్వహించిన ఒక సర్వే షాకింగ్ ఫలితాల్ని వెల్లడించటమే కాదు.. ఐటీ ఉద్యోగులకు ఒకలాంటి హెచ్చరికను చేసిందని చెప్పాలి. గంటల కొద్దీ ఆఫీసుల్లో సీట్లను వదలకుండా కూర్చోవటం.. విరామం లేకుండా పది.. పన్నెండు గంటలు పని చేయటంతో పాటు తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఉద్యోగులకు ఊబకాయం మాత్రమే కాదు లివర్ (కాలేయం) సమస్యలు వస్తున్న విషయాన్ని గుర్తించారు.అది కూడా భారీగా.

హెచ్ సీయూ పరిశోధకులు చేపట్టిన ఈ సర్వే ఫలితాలు ఆందోళనకు గురి చేసేలా.. ఐటీ ఉద్యోగులు తక్షణం తమ ఆరోగ్యం మీద ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పేశాయని చెప్పాలి. హెచ్ సీయూలోని మెడికల్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్లు కల్యాంకర్ మహదేశ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ అనిత.. రీసెర్చ్ స్కాలర్ భార్గవ్.. నందిత ప్రమోద్ లు ఏడాది పాటు నిర్వహించిన ఈ రీసెర్చ్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.

ఐటీ ఉద్యొగుల్ని కలుసుకొని వారిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఇలా టెస్టులు చేయించిన వారిలో 84 శాతం మందికి మెటాబాలిక్ డిస్ ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందన్న విషయం వెల్లడైంది. దీనికి ఐటీ ఉద్యోగుల జీవనశైలి.. పని ఒత్తిడితోపాటు.. వారి ఆహారం కూడా ఒక కారణంగా తేల్చారు. ఐటీ ఉద్యోగులు తీసుకునే ఆహారంలో అధిక క్యాలరీలతో పాటు తియ్యటి శీతల పానీయాలు ఉండటం.. శారీరక శ్రమ లేకపోవటంతోనే ఊబకాయం.. లివర్ సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు.

2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు 3450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. వైద్య పరీక్షలు చేయించుకున్న ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మంది ఊబకాయం.. ఫ్యాటీలివర్ తో పాటు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇందులో ఐదు శాతం మందికి కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయింది. 71 శాతం యువకుల్లోనూ ఊబకాయం ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. 34 శాతం మందిలో జీర్ణక్రియ అపసవ్యంగా ఉందని.. ఆహారం తక్కువగా తీసుకుంటునన అజీర్ణం సమస్య వీరిని వేధిస్తోందని.. దీనికి తోడు 10 శాతం మంది షుగర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లుగా తేల్చారు. సో.. ఐటీ ఉద్యోగులే కాదు.. ఇతర రంగాల్లో పని చేసే వారు సైతం తాము తీసుకునే ఆహారం.. పని మీద కాస్త ఫోకస్ చేసి.. ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.