ఆకస్మిక గుండెపోటు మరణాలపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు
వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావటం.. కుప్పకూలిపోవటం.. ప్రాణాలు కోల్పోవటం లాంటివి ఎక్కువగా జరుగుతున్న వేళ.. దీనికి సంబంధించిన అంశాలపై కేంద్రం ఫోకస్ చేసిన కీలక విషయాన్ని తాజాగా వెల్లడించింది.
By: Tupaki Desk | 22 July 2023 4:20 AM GMTఅప్పటివరకు బాగుండటం.. క్షణాల్లో గుండెపోటుకు గురై మరణిస్తున్న ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్న విషయం తెలిసిందే. ఎందుకిలా? జరుగుతుందన్న ప్రశ్న తప్పించి.. సమాధానం లభించని దుస్థితి. వైద్య నిపుణులు సైతం దీనికి సరైన కారణాన్ని చెప్పలేకపోతున్న వైనంపై కేంద్రం సీరియస్ గా తీసుకుందా? దీనిపై భారీ కసరత్తు చేపట్టిందా? అన్న ప్రశ్నకు తాజాగా ఔనన్న సంచలన విషయం బయటకు వచ్చింది.
వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావటం.. కుప్పకూలిపోవటం.. ప్రాణాలు కోల్పోవటం లాంటివి ఎక్కువగా జరుగుతున్న వేళ.. దీనికి సంబంధించిన అంశాలపై కేంద్రం ఫోకస్ చేసిన కీలక విషయాన్ని తాజాగా వెల్లడించింది.
అయితే.. ఈ ఆకస్మిక మరణాల వెనుక ఉన్న కారణాల్ని నిర్దారించటానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవన్న విషయాన్ని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పార్లమెంటులో వెల్లడించారు.
ఈ తరహా గుండెపోట్లు కొవిడ్ తర్వాత పెరుగుతున్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ వాదనపై కేంద్రం కూడా దృష్టి పెట్టిందన్న విషయాన్ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెబుతూ.. ''కొవిడ్ తర్వాత పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ కేసులకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోవటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహిస్తోంది'' అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
అంతేకాదు.. దేశంలో 18-45 మధ్య వయసులో ఉన్న వారి ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలపై అధ్యయనం దాదాపు 40 ఆసుపత్రులు.. పరిశోధన కేంద్రాల్లో కొనసాగుతోందని పేర్కొన్నారు. ''భారత్ లో 2022లో 18-45 మధ్య ఉన్న జనాభాలో గుండెపోటు ఘటనపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని గుర్తించటానికి దాదాపు 30 కొవిడ్ క్లినికల్ రిజిస్ట్రీ ఆసుపత్రులతో సహా మరో మల్టీ సెంట్రిక్ హాస్పిటల్ అధ్యయనం జరుగుతోంది'' అని వ్యాఖ్యానించటం గమనార్హం.
కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఆకస్మిక గుండెపోటు మరణాలపై కేంద్రం సీరియస్ ఉందన్న విషయంతో పాటు.. దీని వెనుకున్న సీక్రెట్ ఏమిటన్నది తేల్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తాజా జవాబుతో స్పష్టమైందని చెప్పాలి.