Begin typing your search above and press return to search.

పాశ్చాత్యులతో పోలిస్తే మనకే ఆ ముప్పు!

ఇప్పుడు మహిళల్లోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 Jun 2024 10:30 AM GMT
పాశ్చాత్యులతో పోలిస్తే మనకే ఆ ముప్పు!
X

ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో సంభవిస్తున్న మరణాల్లో రెండో స్థానంలో భారత్‌ ఉంది. మనదేశంలో గుండె జబ్బులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. విచ్చలవిడిగా ప్రాసెస్డ్‌ చేసిన ఆహారం తీసుకోవడం, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తినడం, మద్యపానం, ధూమపానం, స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ గంటలు కూర్చుని చేసే పని, మానసిక, శారీరక ఒత్తిళ్లు.. ఇలా వివిధ కారణాల వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయి.

గతంలో వృద్ధుల్లో మాత్రమే గుండె పోట్లు సంభవించేవి. కానీ ఇప్పుడు 17–18 ఏళ్ల యువకుల్లోనూ, 15 ఏళ్ల విద్యార్థుల్లోనూ గుండె పోటు మరణాలు చోటు చేసుకుంటుండటం ఆందోళన రేపుతోంది. అలాగే ఎక్కువగా పురుషులు మాత్రమే గుండెపోటు బారిన పడేవారు. ఇప్పుడు మహిళల్లోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో గుండె జబ్బులు, గుండె సంబంధిత వ్యాధులు (సీవీడీ) పెరుగుదలతో భారతదేశం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాశ్చాత్య దేశాల్లోని ప్రజల కంటే భారతీయులు 10 ఏళ్ల ముందుగానే ఈ వ్యాధులను ఎదుర్కొంటారనే వివిధ సంస్థల అంచనాలు అందరిలోనూ గుబులు రేపుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా గుండె జబ్బులు నిలుస్తున్నాయి. ఈ గణాంకాలకు సంబంధించి భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ప్రతి ఏటా మనదేశంలో 20% కంటే ఎక్కువ మంది పురుషులు,17% మంది మహిళలు గుండె సంబంధిత వ్యాధులతో తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

ప్రపంచంలోని ఇతర దేశస్తులతో పోలిస్తే భారతీయులు కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ (సీఏడీ) వల్ల చనిపోయే ప్రమాదం 20–50% ఎక్కువగా ఉందని గుండె వైద్యులు తేల్చిచెబుతున్నారు. గత 30 ఏళ్లలో భారతదేశంలో గుండె సంబంధిత మరణాలు, దానికి సంబంధించి వైకల్యాల బారినపడినవారి సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం.

ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. భారతీయులు పాశ్చాత్య దేశాలలో కంటే ఒక దశాబ్దం ముందుగానే గుండె సంబంధిత వ్యాధులు బారిన పడతారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛాతీ నొప్పి, గుండెల్లో అసౌకర్యం, గుండెల్లో మంట, తరచూ అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తితే వెంటనే జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారాలు తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి ప్రమాద కారకాలను ముందస్తుగా గుర్తించడంతోపాటు చికిత్స తీసుకోవడం కూడా అవసరమని అంటున్నారు. అలాగే ప్రజలకు గుండె జబ్బులపై అవగాహన కల్పించడం, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం, గుండె జబ్బు లక్షణాలను గుర్తించి తక్షణమే వైద్య సేవలు పొందడం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు. వీటిపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

ప్రజలు జీవనశైలి మార్పులపై దృష్టి సారించడం ద్వారా పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పును ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.