Begin typing your search above and press return to search.

గుండె వైఫల్యంతో మరణం ముప్పు... ముందే కనిపెట్టే సాధనం ఇదే!

ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Dec 2023 6:32 AM GMT
గుండె వైఫల్యంతో మరణం ముప్పు... ముందే కనిపెట్టే సాధనం ఇదే!
X

ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. డ్యాన్స్ చేస్తూనో, జిం లో కసరత్తులు చేస్తూనో, ఆటలు ఆడుతూనో... ఉన్నపలంగా కుప్పకూలిపోతున్నారు. వైద్య సాయం అందేలోగానే చనిపోతున్నారు. ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నవారిలో యువత కూడా ఎక్కువగానే ఉండటం గమనార్హం. ఈ సమయంలో... ఆకస్మిక గుండె వైఫల్యంతో జరిగే ఇలాంటి మరణాల ముప్పును పసిగట్టే ఒక బనియన్‌ ను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

అవును... ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తున్న గుండె పోటు మరణాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోతున్న సంఘటనలు ఎన్నో తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గుండె వైఫల్యంతో సంభవించే మరణం ముప్పును ముందే పసిగట్టడానికి లండన్‌ లోని యూనివర్సిటీ కాలేజీ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు ఎలక్ట్రోకార్డియోగ్రాఫిక్‌ ఇమేజింగ్‌ (ఈసీజీఐ) బనియన్‌ ను తయారుచేశారు.

యూసీఎల్‌ శాస్త్రవేత్తలు కనిపేట్టిన ఈ బనియన్ గుండెలోని విద్యుత్‌ వ్యవస్థను సమర్థంగా స్క్రీన్‌ చేయగలదు. పైగా దీనికి తక్కువ ఖర్చు అవ్వడమే కాకుండా... ఒక్కో రోగికి ఐదు నిమిషాలు మాత్రమే సమయం తీసుకుంటుంది. బనియన్ వంటి ఈ సాధనంలో 256 సెన్సర్లు ఉండగా.. ఇవి గుండెకు సంబంధించిన విద్యుత్‌ డేటాను సేకరిస్తాయి. ఆ వివరాలను ఎమ్మారై చిత్రాలతో కలగలుపుతారు.

వాస్తవానికి గుండె కండర కణజాల ఆరోగ్యాన్ని ఎమ్మారై స్కానింగ్ తెలియజేస్తుంది. ఇందులో భాగంగా... మృత కండర కణాలు ఎక్కడ ఉన్నాయన్నది వివరిస్తుంది. ఈ సమయంలో వాటిని.. ఎలక్ట్రోకార్డియోగ్రాఫిక్‌ ఇమేజింగ్‌ (ఈసీజీఐ) బనియన్‌ అందించే వివరాలతో పోల్చి చూసుకోవడం ద్వారా... గుండె విద్యుత్‌ వ్యవస్థపై అవి ఎలాంటి ప్రభావం చూపొచ్చన్నది తెలుసుకోవచ్చు.

ఫలితంగా... భవిష్యత్‌ లో సంబంధిత వ్యక్తికి గుండె వైఫల్యంతో సంభవించే మరణం ముప్పు ఎంతమేర పొంచి ఉందన్నది గుర్తించొచ్చు. అనంతరం రోగులకు సకాలంలో ఇంప్లాంటబుల్‌ కార్డియోవెర్టర్‌ డిఫిబ్రిలేటర్‌ (ఐసీడీ)ను అమర్చవచ్చు. ఈ సాధనం.. హార్ట్ బీట్ ను పర్యవేక్షిస్తుంది. అవసరమైతే షాక్‌ ఇవ్వడం ద్వారా సాధారణ హార్ట్ బీట్ గా పునరుద్ధరిస్తుంది. కాగా... ఇటీవల దీని విశ్వసనీయత, మన్నిక నిర్ధారణ అయింది.