Begin typing your search above and press return to search.

డీజే ఎఫెక్ట్: శబ్ధం శృతిమించితే...గుండె లయ తప్పుతుంది!

శృతిమించిన శబ్ధాలు వింటే చెవిలో కర్ణభేరి దెబ్బతింటుందని చిన్నప్పటి పాఠాల్లోనే చదువుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2023 9:39 AM GMT
డీజే ఎఫెక్ట్: శబ్ధం శృతిమించితే...గుండె లయ తప్పుతుంది!
X

శృతిమించిన శబ్ధాలు వింటే చెవిలో కర్ణభేరి దెబ్బతింటుందని చిన్నప్పటి పాఠాల్లోనే చదువుకున్న సంగతి తెలిసిందే. అయితే శృతిమించిన శబ్ధాలు, డీజే సౌండ్స్ వంటివాటి వల్ల చెవులు దెబ్బనినడమే కాదు.. గుండె సైతం లయ తప్పే ప్రమాధం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒక్కోసారి గుండె దడ పెరిగి గుండెపోటుతో మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెబుతున్నారు.

అవును... గతంలో పండగలు, పెళ్లి వేడుకలకు డప్పులు, సన్నాయి బూరలు మాత్రమే ఉండేవి. తర్వాత బ్యాండ్ లు... వాటిలో ఫుల్ బ్యాండ్లూ, హాల్ఫ్ బ్యాండ్లూ వచ్చాయి. అయితే అది నాడు.. నేడు అంతా డీజే పాటల మోతే! కార్యక్రమం ఏదైనా డీజే పెట్టాల్సిందే! ఇలా విపరీతమైన శబ్ధాలతో వినిపిస్తున్న డీజేలతో వాతావరణంలో శబ్ద కాలుష్యం పెరగడంతోపాటు.. మెదడు, గుండె, చెవికి సంబంధించిన రుగ్మతలకు గురవుతున్నారని అంటున్నారు.

ఈ మధ్యకాలంలో కేవలం ఈ డీజే లకు డాన్సులు చేయడం, ఆ శబ్ధాలను దగ్గరగా వినడం వల్ల గుండెపోటు వచ్చి పలువురు మృతి చెందిన సంఘటనలకు సంబంధించిన లైవ్ వీడియోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. పైగా వారంతా చనిపోయే వయసువారు కాకపోవడం గమనార్హం.

ఉదాహరణకు తాజాగా జరిగిన వినాయక నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్న యువకుడు కొద్దిసేపటికే ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఉట్నూర్‌ మనీష్‌ గౌడ్‌ అనే యువకుడు వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొని, అనంతరం కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. 108 వాహనంలో నిర్మల్‌ లోని ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

ఇదే సమయంలో ఇటీవల ఓ వేడుకలో పాల్గొని నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శివప్రసాద్‌ అనే వ్యక్తిని ఆదిలాబాద్‌ రిమ్స్‌ కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దానికి కారణం కూడా గుండెపోటే అని చెబుతున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు... డ్యాన్స్ చేస్తూ, డీజేలు వింటూ మెదడుకు అధిక భారం తెప్పించి ఫలితంగా గుండెకు శృతిమించిన ఇబ్బందిని కలిగించడంతో ఒత్తిడికి గురైన గుండె ఆగిపోతుందని అంటున్నారు!

నాయిస్‌ ఇండ్యూసడ్‌ హియరింగ్‌ లాస్‌ వంటి కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా 50 డెసిబుల్‌ శబ్దం విన్నప్పుడు గుండె బాగానే పని చేస్తుంది కానీ.. అక్కడ నుంచి పదేసి డెసిబుల్‌ పెరిగేకొద్ది 8 శాతం గుండె దడ పెరిగి అనేక సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో 90 నుంచి 120 లోపు డెసిబుల్‌ ఉన్న శబ్దాలను అరగంట సేపు వింటే చెవి పాడయిపోతుందని, కర్ణభేరికి రంద్రాలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.

సో... అతి సర్వత్ర వర్జయేత్... పాటలు వినాలంటే ఎంత అవసరమో అంతే శబ్ధంతో వినాలి తప్ప... ఇలా ఊరంతా ఊగిపోవాలని ఆలోచిస్తే... గుండె ఆగిపోయే ప్రమాధాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు!!