బీపీతో బాధపడుతున్నారా .. అయితే !
మారిన జీవన విధానం, ఆహార అలవాట్లతో ప్రపంచంలో 40 శాతం జనాభా అధికరక్తపోటుతో బాధపడుతున్నది.
By: Tupaki Desk | 14 Jun 2024 11:30 PM GMTమారిన జీవన విధానం, ఆహార అలవాట్లతో ప్రపంచంలో 40 శాతం జనాభా అధికరక్తపోటుతో బాధపడుతున్నది. 2025 నాటికి ఈ సంఖ్య 150 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఒకప్పుడు కేవలం వయోజనులలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారిలో కూడా కనిపిస్తున్నది. ఒక్కసారి రక్తపోటు వచ్చిందంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రక్తపోటు మూలంగా హృదయ సంబంధిత సమస్యలతో పాటు, బ్రెయిన్ హెమరేజ్, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఈ పండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు
కాలంతో సంబంధం లేకుండా లభించే పండు అరటిపండు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడే అరటి పండు రక్తపోటుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తీసుకోవడం వల్ల మంచి నిద్రతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు.
అరటితో పాటు కివీ పండు కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు సాయం చేస్తుంది. కివీలోని యాంటీ-ఆక్సిడెంట్లు, మినరల్స్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటితోపాటు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇక సీజనల్ గా లభించే మామిడి పండు కూడా రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా మామిడి తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో ఉండే బీటా కెరోటిన్, ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు.