Begin typing your search above and press return to search.

కొత్తది కాని హెచ్ఎంపీవీ ఏమిటి? దాని గురించి మనకెంత తెలుసు?

2020 ప్రారంభంలో ఇప్పటిలానే కొవిడ్ గురించి వార్తలు రావటం.. మూడు నెలలకే లాక్ డౌన్ పెట్టే పరిస్థితి ఎదురు కావటం తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Jan 2025 9:35 AM GMT
కొత్తది కాని హెచ్ఎంపీవీ ఏమిటి? దాని గురించి మనకెంత తెలుసు?
X

కొవిడ్ నుంచి బయటకు వచ్చి మూడేళ్లు అవుతుందేమో. 2020 ప్రారంభంలో ఇప్పటిలానే కొవిడ్ గురించి వార్తలు రావటం.. మూడు నెలలకే లాక్ డౌన్ పెట్టే పరిస్థితి ఎదురు కావటం తెలిసిందే. దానికి వ్యాక్సిన్ వచ్చి.. సాదారణ పరిస్థితులు చోటు చేసుకునేసరికి 2022 వచ్చింది. రెండేళ్లు గడిచి.. మళ్లీ సాధారణ పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వేళ.. చైనాలో హెచ్ఎంపీ (హ్యుమన్ మెటాన్యుమో) వైరస్ ఒకటి కొత్తగా వచ్చి.. దీంతో డ్రాగన్ దేశం కిందామీదా పడుతుందన్న వార్తలు రావటంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. సోమవారం మన దేశంలోనూ ఐదు కేసులు నమోదైనట్లుగా వార్తలు రావటంతో.. కొవిడ్ 19 పరిస్థితులు తిరిగి వస్తాయా? అన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితం కావటం.. దేశ ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను గుర్తించిన కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా రంగంలోకి దిగి.. ఇదేమీ కొత్త వైరస్ కాదని.. 2001 నుంచి ఈ వైరస్ వచ్చినట్లుగా చెప్పటంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి.

ఇదేమీ అంత ప్రమాదకరమైనది కాదని.. కాకుంటే ఐదేళ్ల లోపు పిల్లలు.. 65 ఏళ్లు పైబడిన పెద్ద వయస్కుల్లో మాత్రం తీవ్ర చిక్కులు తెచ్చి పెడుతుందని.. తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. అనవసర ఆందోళనకు గురి కాకుండా.. దీని గురించి అవగాహన పెంచుకోవటంతో పాటు.. ఎలాంటి జాగ్రత్తలు అవసరం?.. ఒకవేళ ఎవరైనా దీని బారిన పడితే ఏమేం చేయాలన్న విషయంపై ప్రాథమిక సమాచారం అవసరవుతుంది. ఈ వివరాలు అందుకు సాయం చేయొచ్చు.

ఈ వైరస్ ను 24 ఏళ్ల క్రితం గుర్తించారు. 2001 లో నెదర్లాండ్స్ లో దీన్ని గుర్తించారు. మామూలు జలుబు మాదిరే హెచ్ఎంపీవీ కూడా దిగువ.. పై శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇది రెస్పిరేటరీ సిన్ సిషియల్ వైరస్ లాంటి వాటి కోవకు చెందింది. ఏడాదిలో ఎప్పుడైనా ఇది సోకే వీలుంది. చలికాలం.. వసంతకాలం ఆరంభంలో దీని జోరు ఎక్కువ. దీని కారణంగా కొందరిలో న్యూమోనియాకు దారి తీస్తుంది. ఆస్థమా.. సీవోపీడీ వంటి జబ్బులను పెంచొచ్చు. చాలామందికి ఐదేళ్ల లోపు ఇది తొలిసారి సోకుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మళ్లీ వచ్చినా లక్షణాలు మామూలుగా ఉంటాయి.

పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లలో 10-12 శాతం హెచ్ఎంపీవీయే కారణంగా చెబుతారు. చాలామందిలో పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గుతుంది. ఐదు నుంచి పదహారు శాతం పిల్లల్లో మాత్రం న్యూమోనియా లాంటి దిగువ శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లకు దారి తీయొచ్చు. కొవిడ్ కు హెచ్ఎంపీవీకి మధ్య ఉన్న పెద్ద తేడా ఏంటే.. ఇది కొత్తది కాకపోవటం. కొవిడ్ 19 కొత్త వైరస్ కావటం.. దాన్ని ఎదుర్కోవటానికి మన శరీరంలో యాంటీబాడీలు లేవు. దీంతో.. తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీన్ని మనం ఎదుర్కొనే నిరోధకశక్తి సంతరించుకోవటం వల్ల.. అప్పట్లో భారీగా భయపెట్టిన కొవిడ్ ఇప్పుడు మామూలు జలుబుగా మారింది.

హెచ్ఎంపీవీ ఇరవైనాలుగేళ్లుగా ఉండటం వల్ల చాలామందిలో దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు ఉంటాయి. కాబట్టి.. దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది కొవిడ్ అంత తీవ్రమైన వైరస్ కూడా కాదు. రక్తనాళాల్ని దెబ్బ తీయటం.. రక్తం గడ్డలు ఏర్పడేలా చేయటం లాంటి ప్రమాదకర పరిస్థితులకు దారి తీయదు. దీనికి ప్రత్యేక చికిత్స ఏమీ లేదు. ఎవరికి వారికి వచ్చే లక్షణాలకు అనుగుణంగా చికిత్స చేస్తారు.

గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమంటే.. వైరల్ ఇన్ ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పని చేయవు. జలుబు లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవాలి. ఆయా వైరస్ లను బట్టి మందులు వేసుకోవాలి. శ్వాసకోశ వైరల్ ఇన్ ఫెక్షన్లు తగ్గిన తర్వాత కొందరికి బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్లు తలెత్తొచ్చు. దీంతో శ్లేష్మం పసుపు.. ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ వాడుకోవాలి.

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు.. జలుబు లక్షణాలు కనిపిస్తే విడిగా ఉండాలి. ఇతరులకు దూరం పాటించాలి. 65 ఏళ్లు పైబడ్డ వారు.. షుగర్ లాంటి సమస్యలు ఉన్న వారు మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ముక్కు.. నోరు పూర్తిగా కప్పి ఉండేలా మాస్కు ధరించాలి. దగ్గులు.. తమ్ములతో బాధ పడే పిల్లల్ని స్కూల్ కు పంపొద్దు.

- బయట నుంచి ఇంట్లోకి రాగానే కనీసం 20 సెకన్లు సబ్బు.. నీటితో చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇంట్లోని వస్తువుల్ని తాకటం మంచిది. దగ్గినప్పుడు..తుమ్మినప్పుడు రుమాలు.. టిష్యూ పేపర్ ను అడ్డుగా పెట్టుకోవాలి. షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు. అనవసరంగా ముక్కు.. కళ్లు.. నోటిని చేత్తో తాకొద్దు. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. రోజుకు అరగంట పాటు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో పిల్లల ఒంటికి ఎండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు ఇప్పించాల్సిన అన్ని టీకాల్ని ఇప్పించాలి. పోషకాహారం ఇస్తూ.. చంటిపిల్లలకు తల్లిపాలు తప్పనిసరి.

- పిల్లల్లో జలుబు లక్షణాలు కనిపిస్తే భయపడొద్దు. శ్వాస వేగంగా తీసుకుంటున్నా.. పాలు తాగకపోతున్నా.. ఆయాసపడుతుననా.. డొక్కలెగరేస్తున్నా.. జ్వరం తీవ్రంగా ఉన్నా.. మరీ ఎక్కువగా దగ్గుతున్నా.. అశ్రద్ధ చేయొద్దు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లటం చాలా ముఖ్యం. సొంత వైద్యం వద్దు. డాక్టర్లనుఫోన్.. వీడియో కాల్స్ తో వైద్య సేవల్ని తీసుకోవటం చేయొచ్చు. చల్లగాలికి పిల్లల్ని బయట తిప్పకుండా ఇంట్లోనే ఉంచి వైద్యుల సలహాలను పాటించటం మంచిది. ప్రస్తుతానికి దీనికి టీకా లేదు. యాంటీ వైరల్ చికిత్సను సిఫార్సు చేయటం లేదు. కొన్ని జాగ్రత్తలతో దీన్ని వ్యాపించకుండా చూసుకుంటే సరి. చైనాలోనే ఇదేమీ ప్రమాదకరంగా మారలేదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కొవిడ్ లో మాదిరి అక్కడ లాక్ డౌన్ లు చేయటం లాంటివి.. ప్రాణ నష్టానికి సంబంధించిన వార్తలు రాని నేపథ్యంలో.. దీని గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.