మానసిక రుగ్మతల్లో వైరల్ డీఎన్‌ఏ... ఏమిటీ హెర్వ్స్?
మానవ డీఎన్‌ఏ లో 8 శాతాన్ని పురాతన వైరస్ ల నుంచి సంక్రమించిన జన్యుక్రమాలే ఆక్రమిస్తున్నాయని
By: Tupaki Desk | 27 May 2024 9:30 AM GMTమానవ డీఎన్‌ఏ లో 8 శాతాన్ని పురాతన వైరస్ ల నుంచి సంక్రమించిన జన్యుక్రమాలే ఆక్రమిస్తున్నాయని.. బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు కలిగించడంలో కొన్ని పురాతన వైరల్ డీఎన్‌ఏ జన్యుక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటున్నారు అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు. వీరి తాజా పరిశోధనల్లో భాగంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.
అవును... మానసిక సమస్యలు కలగడంలో కొన్ని పురాతన వైరల్ డీఎన్‌ఏ జన్యుక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైందని అంటున్నారు పరిశోధకులు. ఈ జన్యుక్రమాలను "హ్యూమన్ ఎండోజీనస్ రెట్రోవైరసెస్ (హెర్వ్స్)"గా పిలుస్తున్నారు. ఇవి కొన్ని వేల సంవత్సరాల నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ "హెర్వ్స్" మానవ జన్యుక్రమంలో పుష్కలంగా ఉండటం, అవి శరీరంలో అనేక విధులు నిర్విర్తించే అవకాశమున్న నేపథ్యంలో.. కొన్ని రకాల మానసిక రుగ్మతల ముప్పులో ఈ హెర్వ్స్ తో పాత్రపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారట. ఇందులో భాగంగా... శవపరీక్షల సందర్భంగా సేకరించిన 800 మెదడు నమూనాల్లో ఈ "హెర్వ్స్" వ్యక్తీకరణను శోధించారట.
అనంతరం ఈ వివరాలను వేలమంది మధ్య జన్యు వైరుధ్యాలను విశ్లేషించిన జన్యు అధ్యయనాలతో పోల్చి చూశారట. మానసిక సమస్యలున్నవారు, లేనివారిని ఈ పరిశోధనకు ఎంపిక చేశారట. ఈ సమయంలో... ప్రధాన మానసిక రుగ్మతలకు దారితీసే అవకాశమున్న జన్యు కారణాలతో నాలుగు హెర్వ్స్ కు సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు.
ఆ నాలుగింటిలో రెండింటికి స్కిజోఫ్రీనియాతో, ఒకదానికి స్కిజోఫ్రీనియాతోపాటు బైపోలార్ రుగ్మతతో, మరో దానికి కుంగుబాటుతో సంబంధం ఉన్నట్లు వెల్లడైందట. దీంతో... మానసిక సమస్యల్లో అనేక జన్యువులకు పాత్ర ఉందని, వాటిలో హెర్వ్స్ కూడా ఒక భాగమని తెలిపారు పరిశోధకులు!
వాస్తవానికి శాస్త్రవేత్తలు హెర్వ్స్ ను తొలుత వ్యర్థ డీఎన్‌ఏగా భావించారట. అయితే మానవ జన్యుక్రమంపై ఆ వ్యర్థ డీఎన్‌ఏ అనేక విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆ తర్వాత వెల్లడైందని చెబుతున్నారు. ఈ హెర్వ్స్.. ఇతర మానవ జన్యువుల వ్యక్తీకరణను నియంత్రించగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు.