‘సూది’ బాధ తప్పించే ఇన్సులిన్ తయారు చేసిన హైదరాబాద్ కంపెనీ
షుగర్ సమస్య మొదలైందన్నంతనే వణికిపోవటం ఖాయం. రోగం ఏదైనా ఫర్లేదు కానీ.. షుగర్ లాంటి సమస్య తమకు వద్దంటే వద్దన్నట్లుగా వేడుకోవటం కనిపిస్తుంటుంది.
By: Tupaki Desk | 3 Nov 2023 4:11 AM GMTషుగర్ సమస్య మొదలైందన్నంతనే వణికిపోవటం ఖాయం. రోగం ఏదైనా ఫర్లేదు కానీ.. షుగర్ లాంటి సమస్య తమకు వద్దంటే వద్దన్నట్లుగా వేడుకోవటం కనిపిస్తుంటుంది. మనిషిని తినేసే మాయదారి షుగర్ జబ్బుకు దూరంగా ఉంచాలని పలువురు కోరుకుంటూ ఉంటారు. ఈ ఆరోగ్య సమస్య ఎంట్రీ స్థాయిలో ఉండే ఫర్లేదు కానీ.. ఒక మోతాదు దాటితే మాత్రం ఇబ్బందే. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవటానికి వీలుగా ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
నిత్యం సూదితో గుచ్చుకొని.. నొప్పితో ఇబ్బంది పడే ఈ తీపిజబ్బుకు పలువురు హడలిపోతుంటారు. తాజాగా.. ఈ సూది బాధ సమస్యకు చెక్ పెట్టే ఇన్సులిన్ ను డెవలప్ చేసింది హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ. నీడిల్ ఫ్రీ టెక్నాలజీలో సూది అవసరం లేకుండా.. నోటి ద్వారా ఇన్సులిన్ స్ప్రే చేసుకునే ఓజులిన్ ను డెవలప్ చేసినట్లుగా సదరు కంపెనీ చెబుతోంది.
ఇప్పటికే నలభై దేశాలకు పైగా ఓజులిన్ కు అంతర్జాతీయ పేటెంట్లను సాధించినట్లుగా సంస్థ చెబుతోంది. తాజాగా ఓజులిన్ పై భద్రతా పరీక్షలు నిర్వహించటానికి వీలుగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు సంస్థ అప్లికేషన్ పెట్టుకుంది. మనుషులపై క్లినికల్ టెస్టులు చేయటానికి ముందు.. ఈ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థ ఓరల్ ఇన్సులిన్ తో పాటు.. కేన్సర్.. ఆస్టియోపొరాసిస్.. అల్జీమర్స్ లాంటి వ్యాధులకు చికిత్స నిమిత్తం.. నోటి ద్వారా.. ముక్కు ద్వారా స్ప్రేలను అందుబాటులోకి తేవటానికి వీలుగా నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ప్రయత్నిస్తోంది.
తాము డెవలప్ చేసిన ఓరల్ ఇన్సులిన్ స్ప్రేను మనుషులతో పాటు జంతువులకూఉపయోగించొచ్చని సంస్థ చెబుతోంది. ఇటీవల తాము నిర్వహించిన పరీక్షల్లో 91 శాతానికి పైగా బయోఅవైలబులిటీని ప్రదర్శించిందని.. దీని సామర్థ్యం ఏమిటన్న విషయాన్ని తెలియజేసేందుకు వీలుగా 2024-25 నాటికి కుక్కలు.. పిల్లులు వంటి పెంపుడు జంతువులకు సైతం ఓరల్ ఇన్సులిన్ స్ప్రేను ఆవిష్కరించేలా కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.