Begin typing your search above and press return to search.

కూర్చుని పనిచేసే ఉద్యోగులా.. అయితే ఆలోచించాల్సిందే!

ఈ అధ్యయనం 46 శాతం మంది ఐటీ ఉద్యోగులు జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని బాంబుపేల్చింది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 8:21 AM GMT
కూర్చుని పనిచేసే ఉద్యోగులా.. అయితే ఆలోచించాల్సిందే!
X

వివిధ రంగాల ఉద్యోగుల్లో గంటల తరబడి పనిచేసేవారికి ఆరోగ్యపరంగా ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఒకేచోట గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటే దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగులు బహు జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు.

ఐటీ రంగంలో గంటల తరబడి కూర్చుని పనిచేయడం, టాస్కులు పూర్తి చేయాల్సిన ఒత్తిడి, తీవ్ర మానసిక ఒత్తిడితో కూడిన పనివిధానం, నైట్‌ షిప్టులు, అనారోగ్యకర ఆహారపు అలవాట్ల ద్వారా అనారోగ్యం బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలు రోగాలు ఐటీ ఉద్యోగులను చుట్టుముడుతున్నాయని పేర్కొంటున్నారు.

ఈ మేరకు హైదరాబాద్‌ లోని కేంద్ర ప్రభుత్వ పరిశోధక సంస్థ... జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఒక అధ్యయనం నిర్వహించింది. హైదరాబాద్‌ నగరంలో ప్రముఖ ఐటీ సంస్థల్లో పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై ఎన్‌ఐఎస్‌ అధ్యయనం చేసింది. ఆ వివరాలు తాజాగా అంతర్జాతీయ పీర్‌ రివ్యూడ్‌ జర్నల్‌... 'న్యూట్రియంట్స్‌' ఆగస్టు 2023 సంచికలో ప్రచురితమయ్యాయి.

ఎన్‌ఐఎన్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ పరోమితా బెనర్జీ పరిశోధన పత్రం ఆధారంగా ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తల బృందం డా. సుబ్బారావు ఎం.గవరవరపు, డా. భానుప్రకాష్‌ రెడ్డి మరింత లోతుగా ఐటీ ఉద్యోగుల జీవన శైలిపై పరిశీలన జరిపారు. ఈ అధ్యయనం 46 శాతం మంది ఐటీ ఉద్యోగులు జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని బాంబుపేల్చింది. అలాగే ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని షాకింగ్‌ విషయాలు వెల్లడించింది.

ఐటీ ఉద్యోగుల్లో నడుము చుట్టుకొలత ఎక్కువ కలిగిన వారూ ఉన్నారని ఎన్‌ఐఎన్‌ తాజా అధ్యయనం పేర్కొంది. మగవారిలో 90 సెంటీమీటర్లు (సుమారు 36 అంగుళాలు), ఆడవారిలో 80 సెంటీమీటర్ల(సుమారు 32 అంగుళాలు) చుట్టుకొలత కంటే ఎక్కువ ఉంటే.. జీవనశైలి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఎన్‌ఐఎన్‌ తన నివేదికలో తేల్చిచెప్పింది.

మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి ఐటీ సంస్థలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎన్‌ఐఎన్‌ పేర్కొంది. తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, దానికి తగ్గట్టు ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలని తెలిపింది.

ఐటీ ఉద్యోగులు సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చునే పని చేస్తున్నారని వెల్లడించింది. దీంతో 78 శాతం మంది వ్యాయామం, శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారని వివరించింది. కేవలం 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వారంలో నిర్దేశించిన 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తున్నారని వెల్లడించింది.

అలాగే 26 నుంచి 35 ఏళ్ల లోపు వయసులో ఉన్న వారు కూడా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం బారినపడే ప్రమాదంలో ఉన్నారని జాతీయ పోషకాహార సంస్థ హెచ్చరించింది. బయట ఆహారం తీసుకోవడం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భోజనంలో సమయపాలన లేకపోవడం, లేదంటే భోజనం మానేయడం వంటి అలవాట్లు ఐటీ ఉద్యోగులను దీర్ఘకాలిక వ్యాధులబారిన పడేట్టు చేస్తున్నాయని ఎన్‌ఐఎన్‌ అధ్యయనం తెలిపింది.

ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో 30 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న సీనియర్‌ ఉద్యోగుల్లో ఒత్తిడి అధికంగా ఉందని ఎన్‌ఐఎన్‌ పేర్కొంది. తమ అధ్యయనంలో వారిలో జీవనశైలి ప్రమాద కారకాలు ఎక్కువగా కనిపించాయని వెల్లడించింది. జాతీయ పోషకాహార సంస్థకు దేశవ్యాప్తంగా మంచి పేరుండటంతో తాజా అధ్యయనం హాట్‌ టాపిక్‌ గా మారింది.