Begin typing your search above and press return to search.

‘నిఫా’తో యువకుడి మృతి.. కేరళ వైద్యుల కీలక సూచనలు

ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తోంది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 10:15 AM GMT
‘నిఫా’తో యువకుడి మృతి.. కేరళ వైద్యుల కీలక సూచనలు
X

ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే కేరళను ఇప్పుడు నిఫా వైరస్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. వైరస్ కట్టడికి చర్యలు చేపట్టారు.

నిఫా వైరస్ కేరళ వాసుల్లో కలకలం రేపింది. ఏకంగా వైరస్‌తో ఓ యువకుడు మరణించాడు. బాధితుడి వయసు కూడా 24 ఏళ్లు మాత్రమే కావడం తీవ్ర విషాదం నెలకొంది. ఈ మేరకు కేరళ వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. మళప్పురంకు చెందిన యువకుడు బెంగళూరులో చదువుకుంటున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మళప్పురంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎన్‌సెఫిలైటిస్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో అనుమానంతో వైద్యాధికారులు నమూనాలు సేకరించారు. ల్యాబ్‌కు పంపించగా.. పరీక్షించిన వైద్యులు ఆ యువకుడికి నిఫా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు.

పూర్తిస్థాయిలో పరీక్షల కోసం పుణె ల్యాబ్‌కు శ్యాంపిల్స్ పంపించారు. ఆ యువకుడు ఈ నెల 4న అనారోగ్యం పాలవ్వగా.. ఐదు రోజుల తరువాత చికిత్స పొందుతూ చనిపోయినట్లు మళప్పురం టౌన్ వైద్యాధికారి రేణుక తెలిపారు. దీంతో వెంటనే కేరళ వైద్యశాఖ అప్రమతమై అత్యవసర భేటీ అయింది. 16 కమిటీలను ఏర్పాటు చేసి వైరస్ కట్టడికి చర్యలు చేపట్టింది. అయితే.. చనిపోయిన యువకుడు వ్యాధి సోడానికి ముందు తన స్నేహితులతో కలిసి తిరిగినట్లు అధికారులు గుర్తించారు. 151 మందిని అతను కలిసినట్లు నిర్ధారించారు. అంతేకాదు.. వైద్య కోసం నాలుగు ఆస్పత్రులు కూడా తిరిగినట్లు గుర్తించారు. దాంతో ఇప్పుడు వైద్యశాఖ మరింత అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి తీసుకునే చర్యల్లో భాగంగా.. వ్యాధి నిర్ధారణకు ముందు అతను కలిసిన వారిని గుర్తిస్తున్నారు.

ఇప్పటికే వారిని గుర్తించగా.. చాలా మందిని ఐసోలేషన్‌లో పెట్టారు. అయితే.. వారిలోనూ ఓ ఐదుగురికి నిఫా లక్షణాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు. వారి నమూనాలను నిర్ధారణ కోసం ల్యాబ్‌కు శ్యాంపిల్స్ పంపినట్లు చెప్పారు. ఇప్పటికైనా పరిస్థితి అదుపులోనే ఉందని.. ఖంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. అయితే.. జూలై నెలలో అదే నిఫాతో 14 ఏళ్ల బాలుడు చనిపోయాడు. 2018లో డజనుకు పైగా మంది మరణించారు. 2001 నుంచి ఇప్పటివరకు దేశంలో 100కి పైగా నిఫా కేసులు నమోదు కాగా.. ఒక కేరళలోనే 29 శాతం కేసులు వచ్చాయి. తాజాగా.. ఈ యువకుడి మృతితో నిఫాతో చనిపోయిన వారి సంఖ్య 22కి చేరింది. కాగా.. వ్యాధి బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యశాఖ సూచిస్తోంది.