Begin typing your search above and press return to search.

'వైన్' తో గుండెకు మేలు.. తాజా రిపోర్టు చెప్పేదేంటి?

అలా అని తీర్థం మాదిరి కాసింత పుచ్చుకొని ఆపేయగలమా? అన్నది మరో ప్రశ్న.

By:  Tupaki Desk   |   23 Dec 2024 4:45 AM GMT
వైన్ తో గుండెకు మేలు.. తాజా రిపోర్టు చెప్పేదేంటి?
X

వైన్ తాగమని చెబుతుంటారు కొందరు. అది కూడా పరిమితంగానే. కొన్నిరకాల జబ్బులకు మెడిసిన్ గా ఇచ్చే టానిక్ ఎలా అయితే తీసుకుంటామో.. మరీ అంతలా కాకున్నా.. దాంతో పోలిస్తే కాసింత ఎక్కువగా తీసుకుంటే మంచిదంటారు. అందులో నిజం ఎంత? అన్నది ప్రశ్న. అలా అని తీర్థం మాదిరి కాసింత పుచ్చుకొని ఆపేయగలమా? అన్నది మరో ప్రశ్న. నిజానికి అదే సమస్య. వైన్ లాంటి పానీయాలు తీసుకోవటం షురూ చేస్తే.. ఎక్కడి దాకా వెళుతుందన్నదో సందేహం. అయితే.. పరిమితంగా తాగితే చాలా మంచిదని చెబుతున్నారు పరిశోధకులు.

ఇక.. అసలు విషయంలోకి వెళ్లే ముందు మరో కీలక అంశాన్ని స్పష్టంగా చెప్పాలి. ఈ కథనం వైన్ తీసుకొమని చెప్పటం కానీ.. ప్రోత్సహించే లక్ష్యంతో రాయట్లేదు. కేవలం అవగాహన కోసం మాత్రమే రాస్తున్నాం. కొన్ని అంశాల మీద ఉండే ఆసక్తి నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసే క్రమంలోనే ఈ కథనం ఇవ్వటం జరుగుతుందన్న విషయాన్ని గమనించగలరు.

దీనిపై ఉన్న భిన్నాభిప్రాయాల్ని పక్కన పెడితే.. తాజాగా స్పెయిన్ లో ఒక పరిశోధన నిర్వహించారు. దాని తాజా రిపోర్టు ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. రోజూ చిన్ని గ్లాస్ పరిమాణంలో వైన్ తీసుకుంటే గుండెకు మంచిదని.. అది భద్రంగా ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు.. పరిమిత మోతాదులో వైన్ తీసుకున్న తర్వాత నాన్ వెజ్ కంటే వెజ్ ఫుడ్ తీసుకుంటే మరింత చక్కటి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.

అరవై ఏళ్లు దాటిన తర్వాత గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉంటుందని.. ఆ నేపథ్యంలో అలాంటి వారిపైనే పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో భాగంగా 1232 మందిని అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వీరంతా టైప్ 2 డయాబెటీస్ లేదంటే అధిక కొలెస్ట్రాల్.. బీపీ.. అధిక బరువు.. స్థూలకాయం లాంటి సమస్యలతో బాధ పడుతున్నోళ్లే. పరిశోధనలో పాల్గొన్న వారిలో పలువురు.. గుండె జబ్బుల బాధితుల కుటుంబాల నుంచి వచ్చినోళ్లు ఉన్నారు.

పరిశోధనలో భాగంగా నిత్యం వారికి సగం లేదంటే గ్లాస్ వైన్ ఇచ్చారు వైన్ సేవించని వారితో పోలిస్తే.. వైన్ పుచ్చుకున్న వారిలో గుండె పోటు ముప్పు 50 శాతం తక్కువగా ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు.. పరిమితంగా వైన్ తీసుకుంటే మంచిదే కానీ.. రోజుకు గ్లాస్ కంటే ఎక్కువగా తీసుకుంటే మాత్రం రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని ఈ రీసెర్చ్ సారథి డాక్టర్రమోన్ ఈస్ట్రచ్ చెబుతున్నారు. అయితే.. ఈ అధ్యయనం మీద విమర్శలు లేకపోలేదు. పరిశోధన మొత్తం గుండెకు సంబంధించే జరిగిందే తప్పించి.. అల్కహాల్ తో తలెత్తే ఇతర అనారోగ్యాల్ని పరిగణలోకి తీసుకోలేదని చెబుతున్నారు.

వైన్ కూడా మద్యమేనని.. తక్కువ మోతాదులో సేవించే వారిలో కార్డియో వాస్కులర్ డిసీజ్ రిస్కు తగ్గుతుందని తేలినప్పటికి.. ఇతర అవయువాల సంగతేంటి? అన్న వదిలేశారని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ కు చెందిన సీనియర్ డైటీషియన్ ట్రాసీ పార్కర్ చెప్పారు. వైన్ తో సహా ఏ మద్యమైనా సరే ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని.. లివర్ మీద ప్రభావం చూపుతుందని చెప్పటమే కాదు.. అధిక రక్తపోటు.. కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడతారని చెబుతున్నారు. వైన్ తో గుండెకు మంచిదని చాలామంది చెబుతుంటారని.. కానీ.. మోతాదు మించితే గుండెతో పాటు కీలక అవయువాలు దెబ్బ తింటాయని చెప్పారు. వైన్ తో గుండె భద్రంగా ఉంటుందని అనుకుంటే పొరపాటని.. దాన్ని కాపాడుకోవాలంటే మరిన్ని మార్గాలు ఉన్నాయని.. వైన్ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నిజమే కదా.. అది కూడా పాయింటే.