అడుగేస్తే ఆరోగ్యం.. నడకతో ఎన్ని లాభాలో చెప్పిన తాజా రీసెర్చ్
By: Tupaki Desk | 13 Aug 2023 1:30 PM GMTఆరోగ్యంగా ఉండాలి. అందుకు ఏం చేయాలి? గతంతో పోలిస్తే.. కొవిడ్ నేపథ్యంలో వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరికి ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తినే తిండి దగ్గర నుంచి తాగే నీళ్లు వరకు అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అనారోగ్యాలకు దూరంగా ఉండటానికి ఏమేం చేస్తే మంచిదన్న దానిపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా పోలాండ్ లోనిర్వహించిన ఒక రీసెర్చ్ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. దాదాపు 2.26 లక్షల మందిని వేర్వేరుగా అధ్యయనాలు చేసిన వివరాలతో ఈ రిపోర్టును సిద్దం చేశారు.
దీనికి సంబంధించిన వివరాల్ని ప్రివెంటివ్ కార్డియాలజీ అనే యూరోపియన్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. అందులో పేర్కొన్న వివరాల్ని చూస్తే.. ఆరోగ్యంగా ఉండటానికి ఏదేదో చేయాల్సిన అవసరం లేదని.. ఎంత ఎక్కువగా నడిస్తే అంత ఆరోగ్యానికి మంచిదన్న విషయాన్ని వెల్లడించింది. వేసే ప్రతి అడుగు ఆరోగ్యాన్ని పెంచుతుందని.. మహిళలు.. మగవారు ఎవరైనా సరే.. ఏ వయసు వారైనా.. ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే.. నడకకు ఆరోగ్యానికి ఉన్న లింకును ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
ఎక్కువ సేపు కూర్చొని ఉండటం వ్యాధులు పెరగటానికి కారణమన్న విషయాన్ని కొన్ని పరిశోధనలు గతంలోనే వెల్లడించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల్ని చూస్తే.. శారీరక శ్రమ లేని కారణంగా ప్రపంచ వ్యాప్తంగాప్రతి ఏడాది 32 లక్షలకు పైగా మరణాలు చోటు చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.
కొవిడ్ కారణంగా..ఆ కాలంలో ఎక్కువ మందిలో శారీరక శ్రమ లేకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. కొవిడ్ ప్రభావం తగ్గి.. మామూలు పరిస్థితులు నెలకొని రెండేళ్లు అవుతున్న వేళ.. ఆరోగ్యంగా ఉండటానికి నడకకు మించిన ఔషధం మరొకటి లేదని తేలింది. ఎంత ఎక్కువగా నడిస్తే అంత మంచిదని తేల్చారు. రోజుకు గరిష్ఠంగా ఎంత నడిస్తే మంచిదన్న విషయంపై ఇప్పటికి స్పష్టత లేకున్నా.. వివిధ గణాంకాల్ని విశ్లేషించి చూస్తే మాత్రం రోజుకు 20 వేల అడుగులు వేస్తే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని స్పష్టం చేస్తున్నారు.
నడవటం మొదలు పెట్టిన తర్వాత వివిధ దశలు ఉంటాయని చెబుతున్నారు. మొదటి ఐదు నిమిసాల నడక ఆక్సిజన్ ను పెంచుతుందని.. తర్వాతి పది నిమిషాలు రక్తంలో గ్లూకోజ్ ను తగ్గిస్తుందని.. నడక మొదలైన ఇరవై నిమిషాలకు ట్రైగ్లిజరైడర్లను తగ్గిస్తుందని చెబుతున్నారు. రోజుకు కనీసం 3967 అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెప్పిన అధ్యయనం.. 2337 అడుగులతో గుండె సంబంధిత జబ్బులతో మరణించే అవకాశాల్ని తగ్గిస్తాయని పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు 6 వేల అడుగుల నుంచి 10 వేల అడుగులు వేస్తే అకాల మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుందని చెబుతున్నారు.
రోజుకు 10వేల అడుగుల నడక ఉత్తమమని.. కనీసం 45 నిమిషాలు నడవాలని.. సుదీర్ఘ సమయం నడిచేవారు మధ్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. పెద్ద వయస్కులు.. షుగర్ లాంటి జీవనశైలి వ్యాధులు ఉన్న వారు మాత్రం నడిచే వేళలో తగిన జాగ్రత్తలు తీసుకొని.. ఎవరితోనైనా కలిసి నడవాలే కానీ ఒంటరిగా నడవకుంటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. మీరు నడవాలనుకున్న వేళ.. దానికి సంబంధించిన లెక్కల్ని సెట్ చేసుకునేటప్పుడు నిపుణుల సలహాల్ని తీసుకొని పాటిస్తే మరింత మంచిదన్నది మర్చిపోవద్దు.