Begin typing your search above and press return to search.

అత్యంత ప్రమాదకారిగా మారుతున్న నోటి క్యాన్సర్

భారతదేశంలో నోటి క్యాన్సర్ సమస్య జఠిలమవుతోంది. దీంతో చాలా నష్టం వాటిల్లుతోంది

By:  Tupaki Desk   |   6 May 2024 12:30 AM GMT
అత్యంత ప్రమాదకారిగా మారుతున్న నోటి క్యాన్సర్
X

భారతదేశంలో నోటి క్యాన్సర్ సమస్య జఠిలమవుతోంది. దీంతో చాలా నష్టం వాటిల్లుతోంది. దీని వల్ల సుమారు 560 కోట్ల డాలర్ల వరకు నష్టం సంభవిస్తుంది. ఇది దేశ జీడీపీలో 0.18 శాతంగా చెబుతున్నారు. నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండొంతులు మనదేశంలోనే ఉండటం గమనార్హం.

2019 నుంచి 2022 మధ్య కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన 100మంది రోగులపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 91 శాతం మరణాలు నయం చేయలేని క్యాన్సర్లు 41 ఏళ్ల వయసులోనే సంభవించడం జరిగింది. దీంతో నోటి క్యాన్సర్ వల్ల చాలా మంది తమ ప్రాణాలు కోల్పోవడంతో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

70 శాతం ప్రారంభ దశ, 86 శాతం ముదిరిన క్యాన్సర్ల వల్ల మధ్య తరగతి కుటుంబాల్లోనే బయట పడుతున్నాయి. ఇది నిజంగా ప్రమాదకరమే. పేదవారు తమ ఆరోగ్యాల పట్ల అంత జాగ్రత్తగా ఉండరు. వారి పని వారే చేసుకుంటూ వెళతారు. కానీ ఆరోగ్యం గురించి అంతగా శ్రద్ధ తీసుకోరు. దీంతో వ్యాధి ముదిరి తీవ్ర స్థాయికి చేరే అవకాశం పొంచి ఉంటుంది.

అకాల మరణాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకతను మానవ మూలధన విధానం ఆధారంగా లెక్కలోకి తీసుకుంటారు. ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకతను పురుషులయితే రూ.57,22,803, మహిళలైతే రూ. 71,83,917 లుగా గణించి లెక్క గడతారు. ఇలా మన జీవితంలో నోటి క్యాన్సర్ తీవ్రతను గుర్తిస్తున్నారు.

మనదేశంలో నోటి క్యాన్సర్ ఒక భూతంలా వ్యాపిస్తోంది. మనం తినే గుట్కాలు, పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా నోటి క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం ఉంది. కానీ మనవారు దీన్ని లెక్కచేయరు. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు అన్ని మానేస్తే ఎట్లా అని ప్రశ్నించుకుంటారు. దీంతోనే అన్ని తింటూ నోటి క్యాన్సర్ రావడానికి కారకులుగా మిగులుతున్నారు.