Begin typing your search above and press return to search.

రష్యాలో అంతుచిక్కని వైరస్... దగ్గితే రక్తం, లక్షణాలివే!

అవును... గత కొంతకాలంగా ప్రపంచ దేశాలను మనిషి కంటికి కనిపించని వైరస్ లు టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 April 2025 6:16 AM
Mysterious Virus Outbreak in Russia
X

భారత్ సహా పలు దేశాల్లో బర్డ్ ఫ్లూ.. తాజాగా ఓ లగ్జరీ క్రూస్ షిప్ లో నోరా వైరస్.. ఇప్పటికీ పలు చోట్ల కోవిడ్ వైరస్.. నిన్నటి వరకూ పలు రాష్ట్రాల్లో జీబీఎస్ వైరస్.. గత ఏడాది అమెరికా ఈఈఈ వైరస్.. ఇలా ప్రపంచం మొత్తం మనిషిని తీవ్రస్థాయిలో ఆందోళనలకు గురిచేస్తున్నాయి వైరస్ లు! ఈ సమయంలో మరో అంతుచిక్కని వైరస్ తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.

అవును... గత కొంతకాలంగా ప్రపంచ దేశాలను మనిషి కంటికి కనిపించని వైరస్ లు టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కోవిడ్ - 19 మహమ్మారి తర్వాత వైరస్ పేరు చేబితే ప్రపంచం మొత్తం వణికిపోతోంది. అది మిగిల్చిన విషాదాలు అలాంటివి మరి! ఈ సమయంలో రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొనటం ఆందోళన కలిగిస్తోంది.

ఆ కథనాల ప్రకారం... రష్యాలో అంచుతిక్కని వైరస్ ఒకటి విజృంభిస్తుండగా.. దీని ఫలితంగా అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో.. దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ వైరస్ కారణంగా వారు దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం పడుతోందని చెబుతున్నారు. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ మిస్టరీ వైరస్ కు సంబంధించిన పలు నివేదికలు మార్చి 29న వెలువడ్డాయి. ఇందులో భాగంగా... రష్యాలోని పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం, తీవ్రమైన దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని నివేదికలు తెలిపాయి. ఇదే సమయంలో... ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ నివేదికలు పేర్కొన్న పరిస్థితి.

ఈ సమయంలో ఈ లక్షణాలున్నవారికి కోవిడ్ పరీక్షలు చేసినప్పుడు.. రిజల్ట్ నెగిటివ్ వచ్చిందని చెబుతున్నారు. దీంతో... ఇది మరో కొత్త వైరస్ అయ్యి ఉంటుందనే భయాందోళనలతో కూడిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో.. తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నామని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే... ఈ నివేదికలను రష్యన్ అధికారులు ఖండించారు. ఈ సందర్భంగా తాము జరుపుతున్న పరీక్షల్లో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని.. జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. ఈ వదంతులతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదని అన్నారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కోగలమని.. ఆమేరకు తమవద్ద సదుపాయాలున్నాయని అన్నారు.