కొవిడ్ అలెర్ట్: జెట్ స్పీడ్ లో కొత్త వేరియంట్ ఆ దేశంలో
యావత్ ప్రపంచం ఒకేసారి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసిన కొవిడ్ మహమ్మారి పీడకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి.. అది మిగిల్చిన చేదు గురుతుల నుంచి బయటకు వస్తున్నారు
By: Tupaki Desk | 5 Aug 2023 4:43 AM GMTయావత్ ప్రపంచం ఒకేసారి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసిన కొవిడ్ మహమ్మారి పీడకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి.. అది మిగిల్చిన చేదు గురుతుల నుంచి బయటకు వస్తున్నారు. ఆ మధ్యన కొత్త వేరియంట్ కలకలం కాస్త రేగినా.. అదేమీ పెద్ద ప్రభావాన్ని చూపింది లేదు. అందరూ తనను మర్చిపోతున్నారన్న కోపం వచ్చిందన్నట్లుగా ఉంది కొవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు టెన్షన్ పుట్టించేలా మారింది.
వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ రకం కొవిడ్ కు సంబంధించిన కొత్త వేరియంట్ బ్రిటన్ లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈజీ.5,1 కొత్త వేరియంట్ విషయంలో మరింత అప్రమత్తత అవసరమని బ్రిటన్ ఆరోగ్య శాఖ భావిస్తోంది. దేశంలో నమోదవుతున్న కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 14.1 శాతంగా ఉందని చెబుతున్నారు. గత నెలలో తొలిసారి ఈ వేరియంట్ ను గుర్తించారు.
ఈ వేరియంట్ తో తీవ్ర ఇన్ ఫెక్షన్ వస్తుందన్న సూచనలు లేవన్న ఊరడింపు వస్తున్నా.. ప్రజలు మాత్రం దీని విషయంలో ఆలసత్వంతో ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ తీరును జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఈ వేరియంట్ కేసుల నమోదు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కొవిడ్ టెన్షన్ మొదలైనట్లేనన్న మాట వినిపిస్తోంది.