Begin typing your search above and press return to search.

కొత్త వైరస్ హెచ్9ఎన్2 టెన్షన్... కేంద్ర ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు!

అవును... చైనాలో హెచ్‌9ఎన్2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఆ దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్‌ కి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 11:17 AM GMT
కొత్త వైరస్  హెచ్9ఎన్2  టెన్షన్... కేంద్ర ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు!
X

కరోనా వైరస్ ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదనే చెప్పాలి. ఆ వైరస్ వల్ల నరకం చూసిన నరులు, పతనం చూసిన వ్యవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాలు ఎన్నో ఎన్నెన్నో! ఈ సమయంలో డ్రాగన్ దేశం నుంచి మరో వైరస్ మహమ్మారి జెడలు విప్పుతోంది. చైనాలో కొత్తగా హెచ్‌9ఎన్2 వైరస్ వ్యాపిస్తోంది. దీనిపై తాజాగా భారత కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది.

అవును... చైనాలో హెచ్‌9ఎన్2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఆ దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్‌ కి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో చైనాలో వైరస్ పై మరోసారి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందంటే.. ఇప్పటికే ఉత్తర చైనాలో వందల మంది చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో చాలా మంది పరిస్థితి కొంత వరకు విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో కరోనా వైరస్ అనంతరం తలెత్తిన ఈ ముప్పు మన దేశంలోకి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఆ వైరస్ ప్రభావం ఎలా ఉందనే విషయాలపై భారత ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా... భారత్‌ లో దీని ప్రమాదం తక్కువే అని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇదే సమయంలో చైనా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఉత్తర చైనాలోని పిల్లలలో హెచ్9ఎన్2 (ఏవియన్ ఇన్‌ ఫ్లుయేంజా వైరస్) కేసులు, శ్వాసకోశ వ్యాధుల సమూహాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. చైనా నుండి నివేదించబడిన ఏవియన్ ఇన్‌ ఫ్లుయేంజా కేసు, శ్వాసకోశ వ్యాధుల సమూహాల నుండి భారత్ కు తక్కువ ప్రమాదమే ఉందని తెలిపింది. ఇదే సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని వెల్లడించింది.

ఈ ఏడాది అక్టోబర్‌ లో చైనాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కి నివేదించబడిన హెచ్9ఎన్2 కేసు నేపథ్యంలో దేశంలో ఏవియన్ ఇన్‌ ఫ్లుయేంజా కేసులపై సంసిద్ధత చర్యల గురించి చర్చించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ అంచనా మేరకు హెచ్9ఎన్2 కేసుల్లో మనిషి నుంచి మనిషి వ్యాపించే అవకాశం తక్కువగా ఉండటమే కాకుండా, మరణాల రేటు కూడా తక్కువ అని కేంద్రం తెలిపింది.