Begin typing your search above and press return to search.

గుండెపోటుకు కొత్త పరిష్కారం.. ఆర్నెల్లకు ఒక్క ఇంజెక్షన్!

శరీరంలో చెడు కొవ్వు (ఎల్ డీఎల్), మంచి కొవ్వు (హెచ్ డీఎల్) రెండూ ఉంటాయన్నది తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 July 2024 2:30 PM GMT
గుండెపోటుకు కొత్త పరిష్కారం.. ఆర్నెల్లకు ఒక్క ఇంజెక్షన్!
X

అవును.. ఒకే ఒక్క ఇంజెక్షన్. అది కూడా ఆర్నెల్లకు ఒక్కసారి. అది తీసుకుంటే చాలు.. గుండెపోటుకు అవకాశమే లేదన్న కొత్త విషయాన్ని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. సాధారణంగా ఇలాంటి విషయాలు పరిశోధనల ప్రారంభంలోనో.. మధ్యలోనో ఉన్నాయని చెబుతూ.. త్వరలో వస్తుందంటూ ఊరిస్తారు. కానీ.. ఇప్పుడు చెప్పేది మాత్రం అందుకు భిన్నం. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేసిందని.. దీని లాభాల గురించి ఇప్పుడు వైద్యులు ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇంతకూ ఇదేం చేస్తుంది? ఎలా పని చేస్తుంది? దీన్ని వాడాలని వైద్యులు చెబుతున్నారా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

ఈ ఇంజక్షన్ గురించి.. దాని వాడకం గురించి చదివే ముందు.. అసలు సమస్య నుంచి తెలుసుకోవటం మొదలుపెడితే.. విషయం ఇట్టే అర్థమయ్యే వీలుంది.

అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది?

శరీరంలో చెడు కొవ్వు (ఎల్ డీఎల్), మంచి కొవ్వు (హెచ్ డీఎల్) రెండూ ఉంటాయన్నది తెలిసిందే. చెడు కొవ్వు పెరిగిపోతే రక్తనాళాలు పూడుకు పోతాయి. దీంతో గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంటుంది. శరీరానికి హాని చేసే చెడు కొవ్వును తగ్గించేందుకు రకరకాల మందులు ఉన్నాయి.

ఈ మందుకు తాజా ఇంజెక్షన్ కు తేడా ఏంటి?

ఇప్పటివరకు ఉన్న మందులు మొత్తం సంప్రదాయ పద్దతిని ఫాలో అవుతాయి. కానీ.. ఈ ఇంజెక్షన్ మాత్రం జన్యుస్థాయిలో ప్రభావాన్ని చూపి..చెడు కొవ్వు తయారీనే అడ్డుకట్ట వేస్తుంది. ఇది దీని ప్రత్యేకత.

ఇదెలా పని చేస్తుంది?

మనం శరీరంలో ఉండే చెడుకొవ్వు రిసెప్టర్లను నాశనం చేసే ప్రొటీన్ ను నియంత్రించే ఒక కీలక జన్యువు పీసీఎస్ కే 9. చెడుకొవ్వు రేణువుల్ని అతుక్కుని.. ఆ రేణువులను కాలేయంలోకి తీసుకెళ్తాయి. అక్కడ కాలేజం ఎల్ డీఎల్ ను బ్రేక్ డౌన్ చేసి అధికంగా ఉండే చెడు కొవ్వును తగ్గిస్తుంది.

అయితే.. ఇందాక చెప్పుకున్న పీసీఎస్ కే 9 ప్రోటీన్ ఆ రిసెప్టర్లను నాశనం చేయటంతో ఎల్ డీఎల్ రక్తనాళాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయి గుండెపోటుకు కారణమవుతుంది. దీంతో పీసీఎస్ కే 9ను పని చేయకుండా ఉండే ఔషధాలపై సైంటిస్టులు చాలా కాలంగా రీసెర్చ్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన ఇంజెక్షన్ కూడా ఆ కోవకు చెందిందే.

ఇది పీసీఎస్ కే 9 జన్యువును స్విచాఫ్ చేస్తుంది. దీంతో పీసీఎస్ కే 9 ప్రోటీన్ అసలే తయారు కాదు. ఆ ప్రొటీన్ లేకపోవటంతో ఎల్ డీఎల్ రిసెప్టర్లు హాయిగా పని చేసుకోగలుగుతాయి. దీంతో శరీరంలో చెడుకొవ్వు స్థాయి తగ్గి.. గుండెపోటు ముప్పు తగ్గుతుంది.

ఇంతకూ తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కడ లభిస్తుంది?

అపోలో ఆసుపత్రుల్లో లభిస్తుందని ఆ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ (సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్) చెబుతున్నారు. ఒక్కో ఇంజెక్షన్ విలువ దగ్గర దగ్గర రూ.లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఇంజెక్షన్ ఎలాంటి వారికి అవసరం?

చెడు కొలెస్ట్రాల్ బాధితులు ముందు జాగ్రత్త చర్యగా దీన్ని తీసుకోవచ్చు. స్టెంట్ వేయించుకున్న వారు.. బైపాస్ సర్జరీ చేయించుకున్న వారు వాడుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ ట్రైగ్జిజరైడ్స్ ఎక్కువగా ఉన్న వారికి ఉపయోగపడదు. అదే టైంలో ఎల్ డీఎల్ అధికంగా ఉన్న వారికి బాగా పని చేస్తుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారు ఏ వయసు వారైనా ఈ ఇంజెక్షన్ ను చేయించుకోవచ్చు. కాకుంటే.. ఇంజెక్షన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఏది పడితే అది తినటం.. కదలకుండా ఎక్కువసేపు కూర్చోవటం.. వ్యాయామం చేయకపోవటం లాంటి జీవనశైలితో గుండెకు ఇబ్బందులు తప్పవన్న డిస్ క్లైమర్ ను వైద్యులు చెబుతున్నారు. సో.. అన్ని అంశాల్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఇది మెరుగ్గా పని చేస్తుందని చెప్పాలి.