Begin typing your search above and press return to search.

అదే పనిగా సెల్‌ ఫోన్‌ మాట్లాడుతున్నారా.. అయితే ఇక అంతే!

అయితే ఇది నాణేనికి ఒక పార్శ్వమేనని పరిశోధకులు అంటున్నారు. నాణేనికి మరోవైపు చూస్తే మొబైల్‌ ఫోన్‌ తో చాలా సమస్యలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 May 2024 4:06 AM GMT
అదే పనిగా సెల్‌ ఫోన్‌ మాట్లాడుతున్నారా.. అయితే ఇక అంతే!
X

ప్రస్తుతం మన జీవితంలో సెల్‌ ఫోన్‌ విడదీయరాని భాగమైపోయింది. దైనందిన వ్యవహారాలు, తిండి అయినా మానుకుంటున్నారేమో కానీ సెల్‌ ఫోన్‌ ను వాడకుండా ఉండలేకపోతున్నారు. అంతగా మానవాళి జీవితాలతో సెల్‌ ఫోన్‌ పెనవేసుకుపోయింది. సెల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక మానవ జీవితం చాలా సులభతరమైంది.

అయితే ఇది నాణేనికి ఒక పార్శ్వమేనని పరిశోధకులు అంటున్నారు. నాణేనికి మరోవైపు చూస్తే మొబైల్‌ ఫోన్‌ తో చాలా సమస్యలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యాల బారినపడే ప్రమాదముందని చెబుతున్నారు.

మొబైల్‌ ఫోన్‌ లో అదే పనిగా ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) సంభవిస్తుందని చెబుతున్నారు. వారానికి అరగంటకు మించి ఎక్కువసేపు మొబైల్‌ ఫోన్‌ లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని తేలింది. అదేపనిగా గంటల తరబడి ఫోన్‌ లో మాట్లాడితే రక్తపోటు వస్తుందని వెల్లడైంది.

వారంలో 30 నిమిషాల కంటే తక్కువ మాట్లాడేవారితో పోలిస్తే ఎక్కువ సేపు మాట్లాడేవారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని తేలింది. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్‌ లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగినట్టు వెల్లడైంది. ఈ మేరకు ‘యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌ – డిజిటల్‌ హెల్త్‌’ లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది.

యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌ డిజిటల్‌ హెల్త్‌ అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్‌ జౌ లోని సదరన్‌ మెడికల్‌ వర్సిటీ పరిశోధకులు మొబైల్‌ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి.. రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని చెబుతున్నారు.

అదేపనిగా ఫోన్‌ మాట్లాడేవారికి మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు ఉంటున్నాయని పేర్కొంటున్నారు. అలాగే ఎక్కువసేపు ఫోన్‌ లో మాట్లాడటం తీవ్ర తలనొప్పికి దారి తీస్తుందని వివరిస్తున్నారు. ఫోన్‌ ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటంతో చెవి సమస్యలు, ఫోన్‌ స్క్రీన్‌ పై ఎక్కువ సేపు చూడటంతో కళ్ల సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.

ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30–79 ఏళ్ల వయసువారు దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు.

ఇక మనదేశంలో 120 కోట్ల మందికిపైగా మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉండటం గమనార్హం. ఈ రక్తపోటే.. గుండెపోటుతోపాటు అకాల మరణానికి దారి తీస్తోందని చెబుతున్నారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే హైపర్‌ టెన్షన్, ఇతర సమస్యలపై అందరూ జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు.