పొట్టులో ఉండే పోషకాలు గడ్డలో ఉండవట
అయితే ఆలుగడ్డ కంటే దాని మీద ఉన్న పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 19 May 2024 3:30 PM GMT‘సమోసాలో ఆలూ ఉన్నంత వరకు .. బీహార్ లో లాలూ ఉంటాడు’ అని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్న డైలాగ్ రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ విదితమే. ఆలుగడ్డ అందరికీ ఇష్టమే. ఇక ఆలూ ఫ్రై అంటే లొట్ట లేసుకుంటూ తింటాం. ఎన్నో రకాల వంటకాలు దీంతో చేసుకోవడం మూలంగా మన ఆహారంలో అది ప్రధాన భాగం అయింది. అయితే అందరూ ఆలుగడ్డ పొట్టు తీసి వంట చేస్తారు. అయితే ఆలుగడ్డ కంటే దాని మీద ఉన్న పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఆలుగడ్డ మీద మట్టి, దుమ్ము ఉంటున్న నేపథ్యంలో అందరూ దాన్ని కడిగి, ఉడకబెట్టి తర్వాత దాని పొట్టును తీసేస్తున్నారు. పొట్టుతోనే దానిని తినాలని, దానిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఉంటుందని, ఇది హైబీపీని తగ్గించడంతో పాటు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరచడం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం చేస్తుందని చెబుతున్నారు.
ఆలుగడ్డ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయట. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉండటం మూలంగా గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయని చెబుతున్నారు. ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఆలుగడ్డ పొట్టుతో తినడం మూలంగా మేలు జరుగుతుందట. అందుకే ఇక నుండి ఆలుగడ్డను పొట్టుతో సహా తినడం అలవాలు చేసుకోండి.