Begin typing your search above and press return to search.

కొవాగ్జిన్ పై బనారస్ అధ్యయనం.. భారత్ బయోటెక్ ఏం చెప్పింది?

కోవాగ్జిన్ వ్యాక్సిన్ మీద తాము అధ్యయనం చేశామని.. దీన్ని తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ను తాము గుర్తించినట్లుగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   17 May 2024 4:05 AM GMT
కొవాగ్జిన్ పై బనారస్ అధ్యయనం.. భారత్ బయోటెక్ ఏం చెప్పింది?
X

కరోనా మహమ్మారి వేళ.. అపర సంజీవినిలా కనిపించిన వ్యాక్సిన్లకు సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఎంతలా ఉంటాయన్న దానిపై సంచలన నివేదికలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెద్ద ఎత్తున నెగిటివ్ అంశాలు వెలుగు చేసిన కోవిషీల్డ్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లుగా సదరు సంస్థ వెల్లడించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా భారత్ లో తయారైన కొవాగ్జిన్ వ్యాక్సిన్ తోనూ పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం తాజాగా ఒక అధ్యయనం చెప్పటం సంచలనంగా మారింది. ఇంతకూ సదరు అధ్యయనం చేసిన సంస్థ ఏది? అదేం చెప్పింది? అన్నది ఒక ఎత్తు అయితే.. ఈ వ్యాక్సిన్ ను తయారు చేసిన భారత్ బయోటెక్ ఏం చెప్పింది? అన్నది మరో అంశంగా చెప్పాలి.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ మీద తాము అధ్యయనం చేశామని.. దీన్ని తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ను తాము గుర్తించినట్లుగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ తీసుకున్న వారిలో దాదాపు 30 శాతం మంది వేర్వేరు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురైనట్లుగా వెల్లడించారు. బనారస్ విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్యయనంలో భాగంగా 635 మంది యుక్త వయస్కులు.. 291మంది పెద్దవారిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాల్ని స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్ లో ప్రచురించారు.

ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాల్ని చూస్తే..

- శాంపిల్ గా తీసుకున్న వారిలో 304 మంది యుక్త వయస్కులు.. 124 మంది పెద్ద వయస్కుల వారు శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ వారిన పడ్డారు. మొత్తం అధ్యయనంలో వీరు 90 శాతంగా ఉన్నారు.

- యుక్తవయస్కుల్లో 10.5 శాతం మంది చర్మ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొన్నారు.

- 10.2 శాతం మంది సాధారణ అనారోగ్య సమస్యలు.. 4.7 శాతం మంది నాగీ వ్యవస్థకు సంబంధించి సమస్యల్ని ఎదుర్కొన్నారు.

- పెద్దవారిలో 8.9 శాతం సాధారణ రుగ్మతలు.. 5.8 శాతం మంది మస్కులోస్కెలిటల్ సమస్యలు.. 5.5 శాతం మంది నాడీ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారు.

- మహిళల్లో 4.6 వాతం మంది మంత్ సైకిల్ కు సంబంధించిన సమస్యలు వచ్చాయి. 2.7 శాతం మందిలో కంటి సమస్యలు.. 0.6 శాతం మందిలో హైపోథైరాయిడిజం వచ్చినట్లుగా గుర్తించారు.

- కొవాగ్జిన్ తీసుకున్న 0.3 శాతం మందిలో స్ట్రోక్స్.. 0.1 శాతం మందిలో గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడ్డారు.

- రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే మూడు డోసులు తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత నాలుగింతలు.. ఒక డోసు తీసుకున్న వారిలో రెండింతలు ఎక్కువగా ఉన్నాయి.

- కొవాగ్జిన్ తీసుకున్న 926 మందిపై అధ్యయనం జరగ్గా.. వీరిలో ముగ్గురు మహిళలు.. ఒక పురుషుడు మరణించారు.

- కొవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్టస్ చాలా కాలం పాటు కొనసాగే వీలుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి.

బనారస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనం సంచలనంగా మారింది. మొన్నటికి మొన్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సైడ్ ఎఫెక్టస్ ఎక్కువగా ఉన్నట్లుగా వచ్చిన అధ్యయనాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నట్లుగా వివరాలు బయటకు వచ్చిన నేపథ్యంలో భారత్ బయోటెక్ స్పందించింది. తాజా అధ్యయనంపై మాట్లాడిన వ్యాక్సిన్ తయారీ సంస్థ.. తమ వ్యాక్సిన్ పై అనేక అధ్యయనాలు జరిగాయని.. ఆ వివరాలన్నీ ప్రముఖ జర్నల్స్ లో పబ్లిష్ అయిన విషయాన్ని గుర్తు చేసింది.

అన్ని అధ్యయనాలు తమ వ్యాక్సిన్ సురక్షితమైనదని వెల్లడించటాన్ని ప్రస్తావించింది. వ్యాక్సిన్ పై జరిగే అధ్యయనం పూర్తి సమాచారంతో ఉండాలని.. పరిశోధకులకు పక్షపాతం ఉండొద్దని పేర్కొంది. అంతేకాదు తమ వ్యాక్సిన్ తో ఎలాంటి ప్రమాదం ఉండదని స్పస్టం చేసింది.

తాజా అధ్యయనం మీద స్పందిస్తూ. వ్యాక్సిన్ ఎవరిపైన అయితే ట్రయల్ చేస్తామో.. వారు అంతకు ముందు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి వారిపైనే ట్రయల్స్ నిర్వహించాలి. దాన్ని పాటించకుండా వ్యవహరిస్తే మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి సైడ్ ఎఫెక్టులు బయటపడతాయని పేర్కొంది. ట్రయల్స్ నిర్వహించే వేళలో టీకాలు తీసుకోని వారిని ఒక జట్టుగా.. టీకాలు తీసుకున్న వారిని మరో జట్టుగా.. ఇతర కంపెనీల టీకాలు తీసుకున్న వారిని ఇంకో జట్టుగా విభజించి ట్రయల్స్ ఫలితాల్ని తులనాత్మకంగా విశ్లేషించాలంటూ సుదీర్ఘంగా వివరణ ఇచ్చింది.