కోవీషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్... వైద్యులు ఏమి అంటున్నారు..?
ఇందులో భాగంగా... కోవీషీల్డ్ తీసుకున్నవారికి ఇప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందంట అనే గాసిప్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 2 May 2024 4:17 AM GMTచాలా కాలం తర్వాత మరోసారి కరోనా పేరు గత రెండు మూడు రోజులుగా మారుమ్రోగిపోతుంది. ప్రధానంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమనడంతో ఈ విషయం వైరల్ గా మారింది. ఇదే సమయంలో... ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారి వెన్నులో వణుకు పుట్టిందనే కామెంట్లూ వినిపించాయి.
మరోపక్క... ఈ వ్యాక్సిన్ తీసుకుని సైడ్ ఎఫెక్ట్స్ కి గురైన వారికి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ సమయంలో అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఇందులో భాగంగా... కోవీషీల్డ్ తీసుకున్నవారికి ఇప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందంట అనే గాసిప్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
దీంతో... భారత్ లోనూ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్, కొవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా వేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... అటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా వీటిని నామమాత్రపు ధరకు అందించాయి! ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 85 శాతం మంది కొవీషీల్డ్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో తెరపైకి వస్తున్న గాసిప్స్ పై పలువురు వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు!
అవును... కొవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తాము తీవ్ర దుష్ప్రభావాలకు లోనైనట్టు బ్రిటన్ కు చెందిన సుమారు 51 మంది కోర్టులో కేసులు వేయడం.. వీరిలో మొదట కేసు వేసిన జెమీ స్కాట్... ఈ వ్యాక్సిన్ వల్ల తనకు శాశ్వత మెదడు వాపు వ్యాధి వచ్చినట్లు చెప్పడం.. కొవీషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తయారీ కంపెనీ ఆస్ట్రాజెనికా వెల్లడించడం తెలిసిందే!
ఈ నేపథ్యంలో ఈ విషయంపై పలువురు వైద్యులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఈ కోవీ షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు! ఇదే సమయలో... ప్రపంచ వ్యాప్తంగా రక్తం గడ్డకట్టడం అనేది రెండున్నర లక్షల మందిలో ఒకరికి జరగొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుందని అంటున్నారు!
అయితే... దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది వైద్యుల మాటగా ఉంది! ఎందుకంటే... ఈ రక్తం గడ్డకట్టడం అనే సమస్య వ్యాక్సిన్ వేయించుకున్న మూడు నెలలలోపే వస్తుందంట. అందువల్ల... 2020 - 21 సమయంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండి ఉంటే.. అప్పుడే మూడు నెలలలోపే వచ్చేసేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... 2020 - 21 సమయంలో కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఇప్పుడు 2024లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదని వైద్యులు నొక్కి చెబుతున్నారని తెలుస్తుంది! అందువల్ల.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి వస్తున్న వార్తలను చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు!!