Begin typing your search above and press return to search.

120 ఏళ్లు బ్రతకాలని ఉందా... ఎప్పటినుంచో చెబుతున్న శాస్త్రవేత్తలు!

ఈ శతాబ్దం చివరి నాటికి మానవులు 150 సంవత్సరాల వరకూ జీవించడం సాధ్యమవుతుందని డాక్టర్ ఎర్నెస్ట్ చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:27 AM GMT
120 ఏళ్లు బ్రతకాలని ఉందా... ఎప్పటినుంచో చెబుతున్న శాస్త్రవేత్తలు!
X

ప్రస్తుత కాలంలో మనిషి సగటు జీవితకాలం ఎంతంటే... అరవై ఏళ్లకు ఒక ఏడాది అటు ఇటు అనే సమాధానాలు వస్తుంటాయి. మారుతున్న జీవనశైలి, అలవాట్లు, కాలుష్యం ఇందుకు ప్రధాన కారణాలు అని చెబుతుంటారు. అయితే సైన్స్, హెల్త్ కేర్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో... మనిషి జీవిత కాలం ఇప్పుడున్న దానికి డబుల్ చేసుకోవచ్చని, అది ఎంతో దూరంలో లేదని అంటున్నారు పరిశీలకులు.

అవును... ఆరోగ్య, వైజ్ఞానిక రంగాలలో అభివృద్ధి ఇదేస్థాయిలో కొనసాగితే మనుషులు 120 ఏళ్ల వరకు హాయిగా జీవించే రోజు ఎంతో దూరంలో లేదని.. ఈ శతాబ్దం చివరి నాటికి మానవులు 150 సంవత్సరాలు జీవించడం సాధ్యమవుతుందని డాక్టర్ ఎర్నెస్ట్ వాన్ స్క్వార్జ్ అభిప్రాయపడ్డారని న్యూయార్క్ పోస్ట్ నివేధించింది.

వ్యాక్సిన్‌ లతో పాటు సరైన చికిత్సా సౌకర్యాల సహాయంతో, మానవులు కొన్ని దశాబ్దాల క్రితం ప్రాణాంతకంగా భావించిన అనేక వ్యాధులను అధిగమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో 120 ఏళ్ల వరకు హాయిగా జీవించే రోజు ఎంతో దూరంలో లేదని, ఈ శతాబ్దం చివరి నాటికి మానవులు 150 సంవత్సరాల వరకూ జీవించడం సాధ్యమవుతుందని డాక్టర్ ఎర్నెస్ట్ చెబుతున్నారు.

అమెరికాకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎర్నెస్ట్ వాన్ స్వ్కార్జ్.. "సీక్రెట్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ స్టెం సెల్ థెరపీ" వంటి పుస్తకాలను రాశారు. గత చాలా ఏళ్లుగా మానవ కణాల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్న ఆయన తాజాగా ఆరోగ్యవంతులైన వ్యక్తులపై చేసిన రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఇందులో భాగంగా... "స్టెం సెల్ థెరపీ"ని ఉపయోగించి మానవ శరీరంలో నిర్వీర్యం అవుతున్న కణాలకు పునరుజ్జీవనం కల్పిస్తే... తద్వారా ఆ కణాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించి, జీవితకాలాన్ని పెంచుతాయని తన పరిశోధనతో వెల్లడిపరిచారు డాక్టర్ ఎర్నెస్ట్ వాన్. దీనికోసం స్టెం సెల్ థెరపీ తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం వంటి అదనపు కృషి చేయవలసి ఉంటుందని కూడా ఆయన చెప్పారు.

కాగా అధికారిక రికార్డుల ప్రకారం ఇప్పటివరకు మానవ చరిత్రలో 120 సంవత్సరాల వరకు జీవించింది ఒకే ఒక్కరు. 1997 సంవత్సరంలో తుది శ్వాస విడిచిన ఫ్రాన్స్ నివాసి అయిన జీన్ కాల్మెంట్ వయస్సు 122 సంవత్సరాల 164 రోజులు కావడం గమనార్హం.