Begin typing your search above and press return to search.

సరోగసీ నిబంధనల్లో మార్పు... తెరపైకి దాతల పాత్ర!

ఇటీవల కాలంలో సరోగసీ ప్రక్రియ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Feb 2024 5:32 AM GMT
సరోగసీ నిబంధనల్లో మార్పు... తెరపైకి దాతల పాత్ర!
X

ఇటీవల కాలంలో సరోగసీ ప్రక్రియ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. దీనివల్ల చాలామంది దంపతులు తల్లిదండ్రులుగా మారే కలలను నెరవేర్చుకుంటారు. ఇటీవల కాలంలో ఈ విధానం ద్వారా తల్లితండ్రులు అవుతున్న దంపతుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో సరోగసీ నిబంధనలకు సంబందించి కీలక సవరణలు జరిగాయి. తాజాగా ఈ విషయంపై సుప్రీకోర్టులో కీలక విషయాలు తెరపైకి వచ్చాయి!

అవును... సరోగసీ నిబంధనలకు కేంద్రం కీలక సవరణలు చేసింది. ఇందులో భాగంగా... అనారోగ్య కారణాలతో భార్య లేదా భర్త పిల్లలు కనలేని పరిస్థితిలో ఉంటే ఇకపై దాత అండం లేదా వీర్యం వాడుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే... ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయనే విషయంపై జిల్లా వైద్యాధికారి నుంచి ధృవీకరణపత్రం పొందాల్సి ఉంటుంది.

ఈ సమయంలో ఇలా వైవాహిక బంధానికి వెలుపల జన్మించిన సంతానానికి చట్టబద్ధత కల్పించే చట్టం ఏమిటనేది తెలుసుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా ప్రయత్నించింది. సరోగసీ నిబంధనలు - 2022, ఏ.ఆర్‌.టీ చట్టం - 2021లోని పలు అంశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ప్రశ్న వేసింది. ఇదే సమయంలో సరోగసీ నిబంధనల కింద పిల్లలను కనడానికి ముందు వివాహ బంధం ద్వారా గర్భధారణకు ప్రయత్నించాలని తెలిపింది!

వివాహ బంధం ద్వారా గర్భం ధరించాక పుట్టే సంతానాన్ని చట్టబద్ధ సంతానంగా పేర్కొంటారు. ఇదే సమయంలో... పిల్లలకు చట్టబద్ధత కల్పించే చట్టాలు ఇంకేమైనా ఉన్నాయా అంటూ ... సరోగసీ నిబంధనలను సవాల్‌ చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులను, కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి ప్రశ్నించింది.

ఇదే సమయంలో ఈ ప్రశ్నలపై మరింత వివరణ ఇచ్చిన ఐశ్వర్య... ఈ విషయంలో వారిపై చట్టవిరుద్ధ సంతానమనే భావనే లేదని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో అది తొలగిపోయిందని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో సరోగసీ అనేది సంతానం పొందడానికి గల చిట్టచివరి అవకాశమని ఆమె పేర్కొన్నారు.

కాగా... సరోగసి ద్వారా పిల్లలు కావాలనుకునే దంపతుల్లో వీర్యం, అండం కచ్చితంగా వారివే అయ్యి ఉండాలనే నిబంధనలు ఇన్నాళ్లూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆ నిబంధనలకు సవరణలు చేస్తూ... దంపతుల్లో ఎవరికైనా పిల్లలను కనలేని అనారోగ్య కారణాలుంటే దాతల నుంచి వీర్యం, అండం వాడుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపింది!