Begin typing your search above and press return to search.

కేంద్రం సంచలన నివేదిక.. దానితో పదేళ్లలో వేల మంది బలి!

కోవిడ్‌ కు ముందు స్వైన్‌ ప్లూ కూడా భారత్‌ ను కొన్నేళ్లపాటు వణికించింది. చాలామంది దీని బారినపడి మృతి చెందారు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 6:54 AM GMT
కేంద్రం సంచలన నివేదిక.. దానితో పదేళ్లలో వేల మంది బలి!
X

కోవిడ్‌ కు ముందు స్వైన్‌ ప్లూ కూడా భారత్‌ ను కొన్నేళ్లపాటు వణికించింది. చాలామంది దీని బారినపడి మృతి చెందారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నివేదికను విడుదల చేసింది.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్‌ ఫ్లూపై విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2014 నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్‌ ఫ్లూ వైరస్‌ సోకింది. అందులో 8,064 మంది మృత్యువాత పడ్డారు.

స్వైన్‌ ప్లూ కేసులు వెలుగు చూసిన 2014లో 937 మందికి వైరస్‌ సోకగా 218 మంది మరణించారు. ఈ క్రమంలో 2015లో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్‌ ఫ్లూ సోకిందని కేంద్ర నివేదిక వెల్లడించింది. వీరిలో 2,990 మంది మరణించారని తెలిపింది.

2015 తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి వైరస్‌ సోకింది. వీరిలో 2,270 మంది మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో జూలై వరకు ఏడు నెలల్లో 2,783 స్వైన్‌ ఫ్లూ బారిన పడ్డారు. వీరిలో 52 మంది మృత్యువాత పడ్డారు.

గతేడాది 2022లో దేశంలో 13,202 మందికి స్వైన్‌ ఫ్లూ సోకగా 410 మంది మరణించారు. అయితే కేంద్రం వెలువరించిన లెక్కలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నవారివే. ప్రై వేటు ఆస్పత్రులకు వెళ్లి స్వైన్‌ ప్లూ చికిత్స తీసుకున్నవారి వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదు.

ప్రస్తుతం మళ్లీ స్వైన్‌ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో ప్రై వేటు ఆస్పత్రులు రోగులను భయపెట్టి భారీగా నగదు గుంజుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంత చేసినా ప్రైవేటు ఆస్పత్రుల్లో తగ్గకపోవడంతో చివరకు ప్రభుత్వాస్పత్రులకు రోగులు చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

స్వైన్‌ ఫ్లూ రాకుండా ఉండాలంటే గుంపులున్న చోట తిరగకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకే ప్రమాదముందని అంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. చేతులకు గ్లౌవ్స్‌ తొడుక్కోవాలని పేర్కొంటున్నారు.

ఒకవేళ దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ ఫ్లూ అని అనుమానం వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి వైరస్‌ త్వరగా సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యావశ్యకమని అంటున్నారు.

స్వైన్‌ ఫ్లూ ఉన్నవారికి తీవ్రమైన జ్వరం ఉంటుంది. అలాగే దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. జ్వరం, తల నొప్పి తీవ్రంగా ఉంటాయి. పిల్లలయితే కొన్నిసార్లు తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చర్మం బ్లూ లేదా గ్రే కలర్‌లోకి మారే ప్రమాదం కూడా ఉంది. శరీరంపై దద్దుర్లు వస్తాయి. వాంతులు చేసుకోవడంతోపాటు నడవడం కూడా కష్టంగా మారుతుంది. పెద్దల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటాయి.

ఈ నేపథ్యంలో దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే స్వైన్‌ ఫ్లూ విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని కేంద్ర నివేదిక వెల్లడించింది. దీనిపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నారు.