Begin typing your search above and press return to search.

టీనేజ్ బాలికలు సిగరెట్లు తెగ తాగేస్తున్నారు... ఎంత ఎక్కువంటే..?

ఒక దశాబ్దంలో టీనేజ్ లో ఉన్నవారిలో ధూమపానం పెరుగుతుంది.. అయితే... ఈ పెరుగుదల బాలికలలో ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.

By:  Tupaki Desk   |   29 May 2024 10:30 AM GMT
టీనేజ్  బాలికలు సిగరెట్లు తెగ తాగేస్తున్నారు... ఎంత ఎక్కువంటే..?
X

దూమపానం ఆరోగ్యానికి హానికరం! కాదనేవారే లేరు!! అయితే... దూమపానం అంటే టీనేజ్ లోకి వచ్చిన అబ్బాయిలు ఎక్కువగా ఇది అలవాటు చేసుకుంటారని చాలామంది భావిస్తుంటారు కానీ.. ఈ విషయంలో టీనేజ్ బాలికలు కూడా ఏమాత్రం తగ్గడం లేదని అంటున్నారు. తాజాగా వెలువడిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.

అవును... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన భారత పొగాకు నియంత్రణ నివేదికలోని డేటా ప్రకారం... దేశవ్యాప్తంగా మొత్తం పొగాకు వినియోగం తగ్గినప్పటికీ, టీనేజ్ బాలికలలో ధూమపానం రెండు రెట్లు పెరిగింది. ఈ విషయంలో వయసుపైబడి మహిళలలో ధూమపానం తగ్గుతున్నప్పటికీ.. కౌమారదశలో ఉన్నవారిలో మాత్రం ఈ ధూమపానం పెరుగుతోందట.

ఒక దశాబ్దంలో టీనేజ్ లో ఉన్నవారిలో ధూమపానం పెరుగుతుంది.. అయితే... ఈ పెరుగుదల బాలికలలో ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. బాలికలలో ధూమపానం 2009 మరియు 2019 మధ్య అబ్బాయిలతో పోలిస్తే బాలికల్లో సిగరెట్లు తాగడం 6.2 శాతానికి పెరిగిందట. అబ్బాయిలలో ధూమపానం 2.3 శాతం పెరిగిందట.

ఇక పెద్దవారి విషయానికొస్తే... పురుషులలో 2.2 శాతం, మహిళల్లో 0.4 శాతం దూమపానం తగ్గిందని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఆడపిల్లలలో ధూమపానం ప్రాబల్యం (2019లో 6.2 శాతం) మహిళల కంటే (2017లో 1.5 శాతం) చాలా ఎక్కువగా ఉందని నివేదిక చెబుతుంది!

కాగా... టీనేజ్ అమ్మాయిలు ఎక్కువగా ధూమపానం చేయడానికి పలు కారణాలున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... వేగంగా పరిపక్వం చెందడం, అబ్బాయిల మాదిరిగానే తమ బెంగను వదిలించుకోవడానికి, కూల్‌ గా కనిపించడానికి సిగరెట్‌ లు తీసుకోవడం మొదలుపెడుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... ఒత్తిడితో పాటు కొందరు తమ ఆకలి బాధలను చంపుకునే మార్గంగా కూడా దీన్ని చూస్తున్నారని అంటున్నారు.

ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి?:

ధూమపానం శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వంటి హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇదే సమయంలో... పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. దీనివల్ల నెలలు నిండకుండానే పుట్టడం, ఊపిరితిత్తులు దెబ్బతినడం, పుట్టుకతోనే లోపాలతో పిల్లలు పుట్టడం వంటి అదనపు ప్రమాదాలు ఉంటాయని చెబుతున్నారు.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌ లోని 2019 అధ్యయనం ప్రకారం.. పురుషులతో పోలిస్తే ధూమపానం చేసే 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళలకు నిర్దిష్ట రకమైన తీవ్రమైన గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తేలింది!