చైనాలో కలకలం.. భారత్ లో కలవరం.. యూఎస్ లో మరణం!
అవును... గతంలో చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని అల్లల్లాడించి, లక్షలాది కుటుంబాల్లో తీవ్ర శోకాలు మిగిల్చిన కరోనా వైరస్ సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Jan 2025 4:13 AM GMTనూతన సంవత్సరం ప్రపంచం మొత్తం సరికొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభించినట్లు చెబుతుంటే.. సమస్యలు కూడా అలానే తెరపైకి వస్తున్నాయా అనే చర్చ మొదలైంది. బాబా వాంగ, నోస్ట్రడామస్ ల పేర్లు చెప్పి పలు ఆందోళనలు కలిగించే జోస్యాలు హల్ చల్ చేస్తున్న వేళ.. ఇటు వైరస్ లు వాటి పనుల్లో అవి బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
అవును... గతంలో చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని అల్లల్లాడించి, లక్షలాది కుటుంబాల్లో తీవ్ర శోకాలు మిగిల్చిన కరోనా వైరస్ సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ‘చైనాలో వైరస్’ అనే మాట వింటే చాలు ప్రపంచం వణికిపోతుంది. ఈ సమయంలో తాజాగా ఆ దేశంలో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) కలకలం సృష్టిస్తోన్న వేళ.. ఆ తరహా కేసులో భారత్ లోనూ దర్శనమివ్వడం కలవరం పెడుతోంది.
చైనాలో కలకలం సృష్టిస్తున్నట్లు చెబుతున్న హెచ్ఎంపీవీ కేసులు ఇప్పుడు భారత్ లోనూ వెలుగుచూశాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం నాడు తొలి కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించగా.. చెన్నైలోనూ ఇద్దరు శిశువులకు.. అహ్మదాబాద్ లో ఒక చిన్నారికీ ఈ వైరస్ సోకింది.
మరోపక్క... ఈ వైరస్ కొత్తదేమీ కాదని.. దీన్ని 2001లోనే గుర్తించారని.. ఈ వైరస్ పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ వైరస్ చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని.. భారత్ లో పరిస్థితిని ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్. ఎన్.సీ.డీ.సీ. లు నిశితంగా పరిశీలిస్తున్నాయని అన్నారు.
ఇదే సమయంలో... భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ ఇప్పటికే వ్యాప్తిలో ఉందని.. మిగిలిన శ్వాసకోస వైరస్ ల మాదిరిగానే ఇదీ ఉంటుందని.. దీని విషయంలో ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దేశంలో తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
తొలి బర్డ్ ఫ్లూ మరణం!:
ఇలా అటు చైనాలోనూ, ఇటు భారత్ లోనూ హెచ్ఎంపీవీ కి సంబంధించిన ఆందోళనలు నెలకొంటున్నాయని అంటున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు లూసియానాలో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) సోకి మరణించినట్లుగా స్థానిక వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా... ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో సుమారు 65 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఆస్పత్రిలో చేరారని.. అడవి పక్షలు, ఫౌల్ట్రీ ఫాం లకు దగ్గరగా వెళ్లడం వల్ల ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని తెలిపారు. ఇదే సమయంలో.. ఈ వైరస్ అతని నుంచి మరో వ్యక్తికి వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని వెల్లడించారు.
ఈ బర్డ్ ఫ్లూనే 'ఏవియన్ ఇన్ ఫ్లుయోంజా వైరస్' గా పిలుస్తారు. ఇది సాధారణంగా పక్షులు, కోళ్లకు వస్తుంది. అయితే... ఇటీవల రాష్ట్రంలో మానవులలో బర్డ్ ఫ్లూ కేసులు పెరగడంతో కాలిఫోర్నియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు కథనాలొచ్చాయి!