నాన్ వెజ్ తింటారా? బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టాన్ ఫర్డ్ వర్సిటీ
మీరు నాన్ వెజ్ తింటారా? సమాధానం ఎస్ అయితే.. మీరు దీన్ని చదివిన తర్వాత కాస్తంత నిరాశకు గురవుతారు
By: Tupaki Desk | 30 July 2024 9:30 AM GMTమీరు నాన్ వెజ్ తింటారా? సమాధానం ఎస్ అయితే.. మీరు దీన్ని చదివిన తర్వాత కాస్తంత నిరాశకు గురవుతారు. అయితే.. శాఖాహారులకు మాత్రం తాజాగా వెల్లడైన అధ్యయన వివరాలు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటం ఖాయం. శాఖాహార ఆహారాన్ని తీసుకోవటం ద్వారా వాస్తవ వయసు కంటే శారీరక వయసు తగ్గే వీలుందన్న గుడ్ న్యూస్ ను స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం చేపట్టిన ఒక అధ్యయనంలో గుర్తించారు. శాఖాహారుల్లో శారీరకంగా వయసు తగ్గి ఉంటారని.. వారి అవయువాలు తమ వాస్తవ వయసు కంటే తక్కువ వయసులో ఉంటాయని పేర్కొన్నారు.
8 వారాల పాటు 21 మంది కవలలపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించటం గమనార్హం. కవలల పెద్ద ఎత్తున జన్యు సారూప్యతలు ఉంటాయి. అందుకే వీరిని ఎంచుకున్నారు. కవలల్లో ఒకరికి వెజ్ ఫుడ్ ను.. మరొకరికి నాన్ వెజ్ ఫుడ్ ను అందించారు. ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న వారి సరాసరి వయసు 40 ఏళ్లు. అందరూ ఊబకాయుల్నే ఎంపిక చేసుకున్నారు. నాన్ వెజ్ వారికి పాలు.. గుడ్లు.. మాంసం.. పాల ఉత్పత్తులతో కూడిన ఆహారాన్ని అందించారు. శాఖాహారులకు మాత్రం పూర్తి వీగన్ ఫుడ్ ను అందించారు. 8 వారాల పాటు వీరిని టెస్టు చేసినప్పుడు కొత్త విషయాలు వెలుగు చూశాయి.
శాఖాహార ఆహారం తీసుకున్న వారి గుండె.. కాలేయం.. ఇన్ ఫ్లమేటరీ.. జీవక్రియ వ్యవస్థల వయసు.. వారి వాస్తవ వయసు కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో నాన్ వెజ్ ఫుడ్ తీసుకున్న వారిలో అలాంటి మార్పుల్ని గుర్తించలేకపోయారు. అంతేకాదు..వీగన్ ఆహారాన్ని తీసుకున్న వారు సరాసరిన రెండు కేజీలు తగ్గిన వైనం వెలుగు చూసింది. ఇదే వారి శారీరక వయసు తగ్గటానికి ప్రధాన కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
వీగన్ ఆహారం వల్ల చిన్నపాటి పోషహాల లోపం తలెత్తిందని.. వాటి సైడ్ ఎఫెక్టులు కనిపించటానికి కొన్ని ఏళ్లు పడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వీరిలో విటమిన్ బీ12 లోపం తలెత్తుతోందని.. సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే న్యూరో సమస్యలు తలెత్తే వీలుందంటున్నారు. సో.. శుద్ధ శాఖాహారంతో శారీరక వయసు తగ్గుతుందన్న కొత్త నిజం వెలుగు చూసిందని చెప్పాలి. వీగన్లకు ఇంతకు మించిన హ్యాపీ న్యూస్ ఇంకేం ఉంటుంది?