''అడుగుల్లో'' ఆరోగ్య రహస్యం.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే!
అయితే.. ఈ విషయంలో ఎన్ని అడుగులు నడవాలి? అనేది పెద్ద చిక్కు ప్రశ్న.
By: Tupaki Desk | 22 May 2024 3:15 AM GMTప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయిన విషయం తెలిసిందే. కరోనాకు ముందు.. తర్వాత.. వ్యక్తులు.. తమ ఆరోగ్యం విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆసుపత్రులకు వెళ్లడం కంటే.. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే పోలా! అనే సంస్కృతి ఎక్కువగా వ్యాపించింది. ఇది మంచిది కూడా. ఒకప్పుడు.. కేవలం మధుమేహులు(షుగర్) మాత్రమే ఉదయం పూట, సాయంత్ర సమయంలో వాక్(నడక) చేసేవారు. కానీ, ఇప్పుడు వయసుతోనూ.. రోగాలతోనూ సంబంధం లేకుండా.. అందరూ వాక్ చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో ఎన్ని అడుగులు నడవాలి? అనేది పెద్ద చిక్కు ప్రశ్న.
కొందరు గంటల సమయాన్ని దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే.. ఉదయం అరగంట.. సాయంత్రం అరగంట నడిచి ముగిస్తారు. కానీ, ఇది సరైన విధానం కాదని.. కరోనా అనంతరం శాస్త్రవేత్తలు వెల్లడించారు. సమయంతో సంబంధం లేకుండా.. అడుగులను లెక్కించాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బాటలోనే వాకర్స్ నడుస్తున్నాయి. వారు వేసే అడుగులను లెక్కించుకుంటున్నారు. దీనిలో ప్రధానంగా వినిపిస్తున్న మాట. 10 వేల అడుగులు. ఒక వ్యక్తి రోజుకు 10 వేల అడుగులు నడిస్తే.. ఆరోగ్యం స్థిరంగా ఉంటుందన్నది తాజా లెక్కలు చెబుతున్నాయి. దీనికి కూడా ప్రామాణికాలు ఉన్నాయని అంటున్నారు.
ఎన్ని అడుగులకు ఎంత ఆరోగ్యం?
ఒక వ్యక్తి సహజంగా ఎన్ని అడుగులు వేస్తే.. ఎంత ఆరోగ్యంగా ఉంటాడనే విషయంపై అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ, పోలండ్‌లోని లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధనలు చేసి.. ఫలితాలు వెలువరించాయి. దీని ప్రకారం..
+ ఒక రోజుకు 4 వేల అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
+ 4 వేల అడుగులు నడిచిన వారిలో అల్జీమర్స్(మతి మరుపు), డిమెన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అంతేకాదు.. అధికబరువు లేదా ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
+ 2400 అడుగులు నడిచిన వ్యక్తిలో గుండె సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉందని గుర్తించారు.
+ 1000 అడుగులు వేస్తే.(రోజూ) గుండె జబ్బుల సమస్యలను 15 శాతం వరకు తగ్గించుకునే అవకాశం ఉంది.
+ 500 అడుగులు మాత్రమే నడిస్తే.. గుండె సంబంధిత సమస్యలు 7 శాతం మేరకుతగ్గే అవకాశం ఉంది.
+ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు.. కనీసం 6000 నుంచి 10000 అడుగులు నడవాలనేది పరిశోధకులు చెబుతున్న మాట. తద్వారా.. హఠాన్మరణాలు 42 శాతం తగ్గుతాయని అంటున్నారు.
+ అయితే.. వయసుతో సంబంధం లేకుండా.. ఎవరైనా కూడా రోజు 8000 నుంచి 10000 అడుగులు వేయడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.