Begin typing your search above and press return to search.

ప్రపంచ దేశాల్ని కబళిస్తున్న క్యాన్సర్ భూతం లెక్క ఇదే

టెక్నాలజీ పెరిగింది. అంతకంతకూ అందుబాటులోకి వస్తున్న సాంకేతికతకు సైతం సవాలు విసిరే క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు పెను సవాలుగా మారుతోంది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 4:19 AM GMT
ప్రపంచ దేశాల్ని కబళిస్తున్న క్యాన్సర్ భూతం లెక్క ఇదే
X

టెక్నాలజీ పెరిగింది. అంతకంతకూ అందుబాటులోకి వస్తున్న సాంకేతికతకు సైతం సవాలు విసిరే క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు పెను సవాలుగా మారుతోంది. దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదే విషయాన్ని భారత వైద్య పరిశోధనా మండలి రిపోర్టు చెబుతోంది. మరోవైపు.. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రిపోర్టును విడుదల చేసింది. అందులో క్యాన్సర్ విస్త్రతి గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని చెబుతోంది.

భారత్ లో ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్న షాకింగ్ సమాచారాన్ని వెల్లడించింది. తాజాగా విడుదలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు ప్రకారం భారత్ సహా ఆగ్నేయాసియా అంతటా క్యాన్సర్ కేసులు పెరిగినట్లుగా పేర్కొంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో 2022లో కొత్తగా 24 లక్షల కేసులు బయటపడ్డాయని.. వారిలో 56 వేల మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. 2022లో క్యాన్సర్ తో 15 లక్షల మంది చనిపోయినట్లుగా వెల్లడించింది.

2050 నాటికి ఆగ్నేయాసియాలో కొత్త క్యాన్సర్ కేసులు.. మరణాలు 85 శాతం పెరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. మానవాళికి సవాలు విసురుతున్న క్యాన్సర్ గురించి అవగాహన పెంచటం.. దానికి నివారణ చర్యలు తీసుకోవటం.. ముందస్తుగా గుర్తించి.. మెరుగైన చికిత్సను ప్రోత్సహించటం లాంటి లక్ష్యాలతో ప్రతి ఏడాది ఫిబ్రవరి నాలుగున క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎంపిక చేసిన థీమ్ ‘‘యునైటెడ్ బై యూనిక్’’గా పేర్కొన్నారు. క్యాన్సర్ కు వ్యతిరేకంగా సమిష్ఠిగా పోరాడాలన్నది దీని సారాంశం.