వరల్డ్ డయాబెటీస్ డే.. భారత్ లో షుగర్ డేంజర్ బెల్స్!
నవంబర్ 14.. ప్రపంచ మధుమేహ దినం. మనిషి అవయవాలను సైలెంట్ గా దెబ్బతీస్తూ ఆకస్మాత్తుగా మృత్యువు పాలు చేసే షుగర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
By: Tupaki Desk | 14 Nov 2023 8:30 AM GMTనవంబర్ 14.. ప్రపంచ మధుమేహ దినం. మనిషి అవయవాలను సైలెంట్ గా దెబ్బతీస్తూ ఆకస్మాత్తుగా మృత్యువు పాలు చేసే షుగర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. గతంలో పూర్తిగా వయసు మళ్లిన వృద్ధుల్లో మాత్రమే షుగర్ కనిపించేది. ఇప్పుడు పట్టుమని 30 ఏళ్లు నిండని యువత షుగర్ వ్యాధి బారినపడుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన ఉద్యోగ జీవితం.. ఇలా పలు కారణాలతో చిన్న వయసులోనే షుగర్ వ్యాధి బారినపడుతున్నారు.
మనదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తులు అంతకంతకూ పెరుగుతున్నారు.
ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం.. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) నిర్వహించిన అధ్యయనంలో భారత్ లోనే దాదాపు 101 మిలియన్ల మంది(10 కోట్ల మందికి పైనే) మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇది దేశ జనాభాలో సుమారు 11.4% శాతం కావడం అందరిలో ఆందోళన పెంచుతోంది. 2019 నుంచి 2021 మధ్యలోనే సుమారు 31 మిలియన్ల(మూడు కోట్ల) మధుమేహ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
కానీ, ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 80 మిలియన్లదాక (ఎనిమిది కోట్ల) కేసులు నమోదు అయినట్లు ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ పేర్కొనడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ సంఖ్య 2045 నాటికి 135(పదమూడున్నర కోట్లకు) మిలియన్లకుపైగా పెరిగే అవకాశం ఉందని అంచనా. డయాబెటిస్ కేసుల పరంగా భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
మనదేశంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండటానికి వైద్యులు పలు కారణాలను చెబుతున్నారు. పొత్తికడుపు పెద్దగా ఉండి కొవ్వు పేరుకుపోవడం, కండరాల బరువు తక్కువగా ఉండటం ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, తగినంత నిద్ర కరువు కావడం, జీవనశైలిలో వచ్చిన మార్పులు కారణమని చెబుతున్నారు.
ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులతో షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని చెబుతున్నారు. కొవ్వులతో కూడిన ఆహార పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారం అధికంగా తీసుకోవడం, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, పర్యావరణ, జల కాలుష్యాలు కూడా షుగర్ వ్యాధికి కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు