27వేల మంది ఔట్.. సాఫ్ట్‌వేర్‌లో మరో సంక్షోభం
ఏకంగా 40 కంపెనీలు ఇంత పెద్ద స్థాయిలో నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీల్లో ఐబీఎం, ఇంటెల్, సిస్కో వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉండడం గమనార్హం.
By: Tupaki Desk | 6 Sep 2024 12:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ఆర్థిక సంక్షోభం ఐటీ కంపెనీల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆర్థిక మాంద్యం దెబ్బకు ఒక్కో కంపెనీ భవిష్యత్ ప్రశ్నార్థకవుతోంది. స్టార్టప్స్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన కంపెనీలు ఈ సంక్షోభంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దెబ్బకు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయంటే అది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మాత్రమే అని చెప్పాలి. సాఫ్ట్‌వేర్ బూమ్ ప్రపంచంతో ముడిపడి ఉండడం.. ఆర్థిక మాంద్యం సంక్షోభంలో పడడంతో కంపెనీలు మరింత లోతుకు పడిపోతున్నాయి. కంపెనీల్లో అత్యధిక నైపుణ్యాలు కలిగిన వారి భవిష్యత్ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది.
తాజాగా.. పలు టెక్ సంస్థలు ఆగస్టు నెలలో వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. 27వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఏకంగా 40 కంపెనీలు ఇంత పెద్ద స్థాయిలో నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీల్లో ఐబీఎం, ఇంటెల్, సిస్కో వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉండడం గమనార్హం.
కాగా.. ఇంటెల్ సంస్థలో 15వేల మందిని, సిస్కో సిస్టమ్స్ 6వేల మందిని ఇంటికి పంపింది. ఇక యాపిల్, డెల్, షేర్‌చాట్ సంస్థలు సైతం కొంత మంది ఉద్యోగులను వదులుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1.26 లక్షల మంది సాఫ్ట్‌వేర్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు. రానున్న రోజుల్లో సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరిన్ని లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. తగ్గుతున్న అట్రిషన్ రేట్లు, కొనసాగుతున్న ఆర్థిక మాంద్యంతోనే ఈ దుస్థితి నెలకొందని చెబుతున్నాయి.