ఒకేసారి 14వేల మంది ఉద్యోగులకు అమెజాన్ షాక్... ఇదే రీజన్!
ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 19 March 2025 4:30 PM ISTఎంత పెద్ద పెద్ద వేతనాలు పోందుతున్నప్పటికీ.. ఎంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ.. ఇటీవల తరచూ తెరపైకి వస్తోన్న వార్తలు తీవ్ర షాకింగ్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఆ సంఖ్య సుమారు 14 వేలని అంటున్నారు.
అవును... అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. మేనేజింగ్ విభగంలో సుమారు 14వేల మందిని తొలగించబోతోందని తెలుస్తోంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగానే సంస్థ ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ శ్రామికశక్తిలో 13 శాతం అవుట్ అయినట్లే!
అమెజాన్ సంస్థ ఈ తొలగింపులు చేపడితే ఇ-కామర్స్ సంస్థలో మేనేజర్ల సంఖ్య 1.05 లక్షల నుంచి 91 వేలకు తగ్గనుందని.. ఇదే సమయంలో.. ఈ తొలగింపు వల్ల సంస్థకు ఏడాదికి రూ.210 కోట్ల నుంచి రూ.360 కోట్ల వరకూ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టింది అమెజాన్. ఇందులో భాగంగా... మేనేజర్లకు వచ్చే డైరెక్ట్ రిపోర్టుల సంఖ్యను పెంచింది.. ఇదే సమయంలో, సీనియర్ లెవల్ లో ఉద్యోగాల నియామకాన్ని కూడా పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగాల తొలగింపును చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
కాగా... ఈ ఏడాది జనవరి నుంచి వారానికి ఐదు రోజుల పాటు ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు సంస్థ సీఈవో ఆండీ జాస్సీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆఫీసుకు రావడం వల్ల వేగంగా నేర్చుకోవడంతోపాటు తోటివారితో మెరుగైన సంబంధాలు కలిగి ఉండటానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.
వాస్తవానికి 2019 నాటికి అమెజాన్ లో ఉద్యోగుల సంఖ్య 7.98 లక్షలుగా ఉండగా.. కొవిడ్ సమయంలో భారీగా రిక్రూట్ మెంట్స్ పెంచేసింది. దీంతో... 2016 నాటికి ఉద్యోగుల సంఖ్య 16 లక్షలకు పెరిగిపోయింది. అనంతరం ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా అని చెబుతూ 2022, 2023లో వివిధ సందర్భాల్లో వేల మందిని తొలగించింది.
ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా మేనేజింగ్ విభాగంలో ఒకేసారి 14వేల మందిని తొలగించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఖర్చులు తగ్గించుకునే విషయంలో భాగంగానే ఈ చర్య అని అంటున్నారు!