Begin typing your search above and press return to search.

బ్రో.. 6 నెలలు.. లక్షల జీతాలు కాదు.. లక్ష ఐటీ కొలువులు హుష్!

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం రూ.లక్షల జీతాలతో ఎందరి జీవితాలనో మార్చింది. కొన్నిసార్లు అంతే స్థాయిలో జీవితాలను తలకిందులు చేసింది.

By:  Tupaki Desk   |   22 Jun 2024 11:30 PM GMT
బ్రో.. 6 నెలలు.. లక్షల జీతాలు కాదు.. లక్ష ఐటీ కొలువులు హుష్!
X

"అబ్బే.. ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు బ్రో.. హైరింగ్ లు లేవు.. పింక్ స్లిప్ లే.. అక్కడికే వచ్చేస్తాం.. ఏమైనా మంచి జాబ్ ఉంటే చూడు".. ఇదీ అమెరికాలోని ఓ తెలుగు టెకీ హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ సీనియర్ మేనేజర్ కు ఫోన్ లో చేసుకున్న అభ్యర్థన. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ సంగతి స్పష్టం చేస్తోంది. ఇక గణాంకాల పరంగా చూస్తే దిమ్మతిరగడం ఖాయం అనిపిస్తోంది.

ఆనాటి పరిస్థితులు మళ్లీ?

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం రూ.లక్షల జీతాలతో ఎందరి జీవితాలనో మార్చింది. కొన్నిసార్లు అంతే స్థాయిలో జీవితాలను తలకిందులు చేసింది. ఇంతెందుకు.. 2008లో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఎదురైంది. ఆ సమయంలో కొలువులు పిట్టలా రాలాయి. ఇక కొన్నేళ్లుగా ప్రసిద్ధ కంపెనీలు సైతం లే ఆఫ్ లు ప్రకటిస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఇది ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం అని చెప్పొచ్చు.

జాబ్ ఉంటుందా బ్రదర్..?

ఐటీలో ఇప్పుడు ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి. 2024 మొదలై ఆరు నెలలు కూడా కాలేదు. 337 సంస్థలు 98,834 మంది టెకీలను పీకి పారేశాయి. 2022లో అమెజాన్, మైక్రోసాఫ్ట్‌, గూగుల్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలు వేలాది మందిని తొలగించాయి. నిరుడు దీనికి 59 శాతంపైగా లేఆఫ్‌ లు పెరిగాయి. మొత్తం 2,62,915 ఉద్యోగాలు పోయాయి.

కరోనా సమయంలో ఎక్కువమందిని తీసుకోవడం, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం రావడమే ప్రస్తుత దుస్థితికి కారణం.ఖర్చు తగ్గించుకోవడంపై కంపెనీల ఆలోచన కొనసాగితే.. 2024లో ఉద్యోగాల ఊస్టింగ్ కొనసాడం ఖాయం అనే సూచనలున్నాయి.

నిరుడు లేఆఫ్‌ లతో 20 వేల మంది టెకీలపై ప్రభావం పడిందనేది ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్‌ ఉద్యోగుల సంఘం అంచనా. మరో నివేదిక ప్రకారం.. 2024లో మొదటి ఐదునెలల్లోనే కొన్ని బడా ఐటీ కంపెనీల నుంచి 2 వేల నుంచి 3 వేల మందిని గుట్టు చప్పుడు కాకుండా పంపేశారు. వారి రిలీవింగ్ లెటర్‌ లో ‘టర్మినేటెడ్’ అని ఉంటోంది. దీంతో ఇంకో ఉద్యోగం వెదుక్కోవడం కష్టమే.

కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించుకునే ఉద్దేశంలో వారితో విపరీతంగా పనిచేయిస్తున్నాయి. పనికిరాని పనులు అప్పగిస్తున్నాయి. పైకితిరిగి తక్కువ రేటింగ్ ఇస్తూ.. వారంతట వారే రాజీనామా చేసే పరిస్థితులు కల్పిస్తున్నాయి.