Begin typing your search above and press return to search.

కొలువులు పీకేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్

ఉద్యోగంలో సాయపడుతుందనుకుంటే ఉద్యోగానికే ఎసరు పెట్టేలా తయారవుతోందా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్..?

By:  Tupaki Desk   |   10 Sep 2023 11:33 AM GMT
కొలువులు పీకేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
X

ఉద్యోగంలో సాయపడుతుందనుకుంటే ఉద్యోగానికే ఎసరు పెట్టేలా తయారవుతోందా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్..? ఆర్ధిక మాంద్యం సమయంలో ఉద్యోగులను మరింత ప్రమాదంలోకి నెడుతోందా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. కొన్ని పరిణామాలను పరిశీలిస్తే నిజమనే జవాబు దొరుకుతోంది. చిన్న సంస్థల నుంచి అంతర్జాతీయ కంపెనీల వరకు ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. ఈ సమయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టూల్స్‌ వినియోగం పెరగడం ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఉందంటున్నారు. వీటివల్ల ఉద్యోగం కోల్పోయిన వారి బాధల్ని, కష్టాలు వర్ణనాతీతం.

చాట్ జీ పీటీ నన్ను పీకేసింది

టెక్ ప్రపంచంలో ఓ సంచలనం చాట్ జీపీటీ. నిరుడు నవంబరులో విడుదలైన దీంతోపాటు ఏఐ జ‌న‌రేటివ్ టూల్స్ ఉద్యోగాలకు ముప్పు తెచ్చాయి. వీటి రాకతో ఉద్యోగాలు గల్లంతేననే చర్చ సాగింది. ఇప్ప‌టికే ప‌లు రంగాల్లో ఉద్యోగాల‌ను ఏఐ టూల్స్ రీప్లేస్ చేయడమే దీనికి కారణం. కాగా, చాట్‌జీపీటీ కారణంగా ఉద్యోగం కోల్పోయానంటూ ఓ ఉద్యోగి సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ది వెర్జ్‌ నివేదిక ప్రకారం.. 2002లో ప్రముఖ టెక్‌ బ్లాగ్‌ గిజ్‌మోడో ప్రారంభమైంది. గిజ్‌మోడో స్పానిష్‌ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆ సంస్థ యాజమాన్యం తొలగించింది. వారి స్థానంలో చాట్‌జీపీటీని వాడడం ప్రారంభించింది. ఉద్యోగం కోల్పోయిన బాధిత ఉద్యోగుల్లో ఒకరైన మాటియాస్ ఎస్ జవియా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంది. గిజ్‌మోడ్‌ ట్రాన్స్‌లేటర్లను మార్చేసేంది. వారి స్థానంలో ఏఐని ఉపయోగిస్తుంది. అంటే మనుషులు ఉద్యోగుల్ని ఏఐ రిప్లేస్‌ చేసింది’’ అని వాపోయారు.

ఆర్టిఫీషియల్ ఎంతైనా ఆర్టిఫీషియలే..

ఉద్యోగుల తొలగింపుపై గిజ్‌మోడో కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంజీ కార్మిక సంఘం మండిపడుతోంది. ఎంతో నైపుణ్యం కలిగిన పాత్రికేయుల స్థానంలో కృత్రిమ మేధను తీసుకురావడాన్ని సంఘం ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఏఐని ఉపయోగించి అనువాదం చేయడం అంత మంచిది కాదని.. ఆ ఆర్టికిల్స్ వినియోగదారులను ఆకట్టుకోవడం లేదని చెబుతున్నారు. అందులోనూ వాటిలో అక్షర దోషాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అన్నిటికీ మించి ఎమోషన్‌ క్యారీ చేసేలా అంశాలు లేవని చెబుతున్నారు. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోయాయని గతంలో కార్మికులు ఫిర్యాదు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ కంపెనీలు ఉద్యోగుల ఆవేదనను పట్టించుకోవడం లేదు. డబ్బును ఆదా చేసేందుకు, వేగంగా పని పూర్తి చేసేందుకు సహకరిస్తున్న ఏఐ టూల్స్ వాడకానికి మొగ్గుచూపుతున్నారు.