Begin typing your search above and press return to search.

మొన్న 4వేలు.. నేడు 5600 ఉద్యోగులపై ఆ సంస్థ వేటు!

ఖర్చులు తగ్గించే పేరుతో కొన్ని ఐటీ కంపెనీలు చేపట్టిన ఉద్యోగాల కోత అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 8:30 AM GMT
మొన్న 4వేలు.. నేడు 5600 ఉద్యోగులపై ఆ సంస్థ వేటు!
X

ఖర్చులు తగ్గించే పేరుతో కొన్ని ఐటీ కంపెనీలు చేపట్టిన ఉద్యోగాల కోత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మొన్నటికి మొన్న నాలుగు వేల మంది ఉద్యోగులకు శ్రీముఖం ఇస్తూ ఇంటికి పంపిన టెక్ దిగ్గజం సిస్కో తాజాగా మరో 5600 మందిని ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది.

దీంతో.. భారీగా ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 7 శాతం మందిని ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా తొలగింపులతో సంస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు. మరోవైపు.. ఈ దారుణ నిర్ణయం తీసుకున్న రోజునే సంస్థ ఆర్థిక పరిస్థితి బాగుందని.. లాభాలు రెట్టింపు అయినట్లు పేర్కొనటం గమనార్హం.

గత ఏడాది ఆగస్టు నుంచి తమ వద్ద పని చేసే సిబ్బందిని తగ్గించే పనిలో ఉంది సిస్కో. తాము తొలగించే ఉద్యోగుల విభాగాల్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. తొలగింపులకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులకు నెల మధ్యలో చెప్పినట్లుగా చెబుతున్నారు. మరోవైపు టెక్ క్రంచ్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం సిస్కోలో పని వాతావరణం ఆధ్వానంగా ఉన్నట్లుగా వెల్లడైంది. ఇక్కడి వర్కు కల్చర్ ను పలువురు ఉద్యోగులు విష పూరితంగా అభివర్ణించటం గమనార్హం.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఓవైపు ఉద్యోగుల్ని భారీగా తీసేస్తున్నప్పటికీ సంస్థ మాత్రం లాభాల్లో ఉన్న విషయం వెల్లడైంది. అంతేకాదు కంపెనీ నమోదు చేసిన లాభాలు రికార్డు స్థాయిలో ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. సుమారు 54 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో 2024లో రికార్డు స్థాయిలో బలమైన రెండో సంవత్సరంగా కంపెనీ తన ఆర్థిక నివేదికలో పేర్కొంది. ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున కోత పెట్టిన రోజునే.. సంస్థపై ఎలాంటి ప్రభావాన్ని చేపట్లేదన్న విషయాన్ని చెప్పటం గమనార్హం.