షాకింగ్: ఐఐటియన్లకూ కొలువులు దొరకట్లేదు
మిగిలిన వారికి సంగతి ఎలా ఉన్నా.. దేశంలోనే అత్యంత ప్రముఖ విద్యా సంస్థలుగా పేరున్న ఐఐటీల్లో విద్యాభాస్యం పూర్తి కాక ముందే కొలువులు క్యూ కట్టటం తెలిసిందే.
By: Tupaki Desk | 29 March 2025 4:10 AMమిగిలిన వారికి సంగతి ఎలా ఉన్నా.. దేశంలోనే అత్యంత ప్రముఖ విద్యా సంస్థలుగా పేరున్న ఐఐటీల్లో విద్యాభాస్యం పూర్తి కాక ముందే కొలువులు క్యూ కట్టటం తెలిసిందే. అందుకు భిన్నమైన సీన్ తాజాగా నెలకొన్న షాకింగ్ నిజం బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో క్యాంప్ ప్లేస్ మెంట్లు భారీగా తగ్గిన చేదు నిజం బయటకు వచ్చింది. 23 ఐఐటీల్లో 22 ఐఐటీల్లో ప్లేస్ మెంట్లు తగ్గుముఖం పట్టినట్లుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టు వెల్లడించింది. 2021 - 22తో పోలిస్తే 2023624లో ఐఐటీ బీహెచ్ యూ మినహా 23 ఐఐటీల్లో 22 చోట్ల బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల ప్లేస్ మెంట్లలో క్షీణత నమోదైనట్లుగా వెల్లడైంది.
ఈ జాబితాలో 25 శాతం తగ్గుదలతో ఐఐటీ ధార్వాడ్ టాప్ లో ఉండగా.. 2.88 శాతం తగ్గుదలతో ఐఐటీ ఖరగ్ పూర్ చివరి స్థానంలో నిలిచింది. 15 ఐఐటీల్లో ప్లేస్ మెంట్ రేటు పది శాతానికి పైగా తగ్గినట్లుగా రిపోర్టు వెల్లడించింది. 2021-22, 2023-24 మధ్య ఐఐటీలు.. ఐఐటీల్లో ప్లేస్ మెంట్లు అసాధారణంగా తగ్గినట్లుగా బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన రిపోర్టు వెల్లడించింది. ఎందుకిలా? దీనికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. విద్యార్థులు ఉన్నత విద్యకు మొగ్గు చూపటం.. స్టార్టప్ ల వైపు మళ్లటం కూడా ప్లేస్ మెంట్ల రేట్లు తగ్గటానికి కారణాలుగా పేర్కొన్నారు.
ఎన్ఐటీల్లోనూ ఇలాంటి సీనే ఉందని పేర్కొంది. 2022-23, 2023-24 మధ్య విద్యార్థులకు అందిన సగటు వేతన ప్యాకేజీల్లో తగ్గుదల నమోదైనట్లుగా పేర్కొంది. తాజా రిపోర్టు ప్రకారం ఐఐటీ వారాణసీలో ప్లేస్ మెంట్ రేటు 83.15 శాతం నుంచి 88.04 శాతానికి పెరిగినట్లుగా తెలిపింది. ఈ ఒక్కచోట మాత్రమే పెరుగుదల 4.89 శాతంగా ఉంది.
ఐఐటీ ధార్వాడ్ లో ప్లేస్ మెంట్లు 90.20 శాతం నుంచి 65.56 శాతానికి.. ఐఐటీ జమ్ములో 92.08 శాతం నుంచి 70.25 శాతానికి.. ఐఐటీ రూర్కీలో 98.54 శాతం నుంచి 79.66 శాతానికి తగ్గాయి. 2021-22లో మొత్తం 23 ఐఐటీలకు 14 చోట్ల 90 శాతానికి పైగా ప్లేస్ మెంట్లు నమోదు అయ్యాయి. అదే సమయంలో 2022-23లో కేవలం మూడు ఐఐటీలు మాత్రమే 90 శాతం దాటటం గమనార్హం. ఈ మూడింటిలో జోధ్ పూర్.. పట్నా.. గోవాలు నిలిచాయి.