తాజా నివేదిక: మంచి పనోడైతే కోరుకున్న సదుపాయాలు సొంతం
రిస్క్ అడ్వైజరీ బ్రోకింగ్ సంస్థ డబ్ల్యూటీడబ్ల్యూ నిర్వహించిన 2024 గ్లోబల్ బెనిఫిట్స్ యూటిట్యూడ్ సర్వేను చూస్తే ఆసక్తికర అంశాలకు కొదవ లేదు.
By: Tupaki Desk | 9 Jun 2024 5:51 AM GMTఆసక్తికర రిపోర్టు ఒకటి తాజాగా విడుదలైంది. ఇందులో ప్రతిభ కలిగిన ఉద్యోగుల విషయంలో ఆయా కంపెనీలు ఏ రీతిలో వ్యవహరిస్తున్నయన్న విషయాన్నివెల్లడించింది. రిస్క్ అడ్వైజరీ బ్రోకింగ్ సంస్థ డబ్ల్యూటీడబ్ల్యూ నిర్వహించిన 2024 గ్లోబల్ బెనిఫిట్స్ యూటిట్యూడ్ సర్వేను చూస్తే ఆసక్తికర అంశాలకు కొదవ లేదు. కార్పొరేట్ సంస్థలు.. ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని తమ వద్దే ఉంచుకోవటం కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొంది.
ఇందుకోసం అవసరమైతే కొత్త తరహా సేవల్ని అందించేందుకు సైతం ఓకే చెబుతున్నట్లుగా వెల్లడైంది. ప్రతిభావంతులైన ఉద్యోగులకు మంచి జీతంతోపాటు.. వారికి అవసరమైన ఇతర అవసరాల్ని తీర్చే అంశానికికూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.
పనితనం బాగుండే ఉద్యోగులకు ఇబ్బంది కలుగకుండా వారికి సౌకర్యవంతంగా ఉండేలా పని విధానాలు.. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సైతం ఆరోగ్య బీమా.. పెంపుడు జంతువుల సంరక్షణ అంశాలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఒక సంస్థలో ఉద్యోగులు కంటిన్యూ కావటానికి మంచి ప్యాకేజీనే కారణమని 76 శాతం మంది ఉద్యోగులు పేర్కొనటం గమనార్హం. మూడు వంతుల్లో రెండు వంతుల మంది ఉద్యోగులు తమ వేతన ప్యాకేజీ మారకున్నా.. ఉత్తమ ప్రయోజనాలను ఆశించి.. తాము చేస్తున్న ఉద్యోగాల్ని వదిలేస్తున్నట్లు చెబుతున్నారు. మంచి సౌకర్యాలు కల్పించే సంస్థలవైపు మొగ్గు చూపుతున్నారు.