తిని హాయిగా పడుకోండి.. నెలకు రూ.4.7 లక్షల జీతం
ఈ ప్రపంచంలో అత్యంత సుఖవంతమైన పని ఏదైనా ఉందంటే.. అది తినడం.. పడుకోవడం.. అవును.. దానంత సౌఖ్యం ఎందులోనూ ఉండదు
By: Tupaki Desk | 15 March 2025 11:00 PM ISTఈ ప్రపంచంలో అత్యంత సుఖవంతమైన పని ఏదైనా ఉందంటే.. అది తినడం.. పడుకోవడం.. అవును.. దానంత సౌఖ్యం ఎందులోనూ ఉండదు. పడుకుంటే పైసలిస్తామంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది. ఇప్పుడు అదే పనిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కల్పిస్తోంది. చేయాల్సిందల్లా కేవలం తినండి.. హాయిగా పడుకోండి.. దీని కోసం మీకు నెలకు జీతం కూడా ఇస్తుందండోయ్.. ఇంకెందుకు ఆలస్యం త్వరపడుదామనుకున్నారా? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
ఉద్యోగుల పని గంటలు, తొలగింపుల గురించి ఆందోళనలు కొనసాగుతున్న ఈ సమయంలో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఒక వింతైన కానీ ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, నిజంగానే ఈఎస్ఏ కేవలం తిని పడుకుంటే నెలకు ₹4.7 లక్షల జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
అయితే, ఇది అంత సులభం కాదు. ఈఎస్ఏ తాము తయారుచేసే వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ స్పెషల్ బాత్ టబ్‌ల నాణ్యతను పరీక్షించడానికి ఈ ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించింది. ఈ టబ్‌లకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో ఈఎస్ఏ ఎల్లప్పుడూ పనిచేస్తుంది.
ఈ ప్రయత్నంలో భాగంగా ఈఎస్ఏ ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైనా పది రోజుల పాటు వారి వాటర్ బెడ్‌పై తింటూ, విశ్రాంతి తీసుకుంటూ ఉంటే వారికి ₹4.7 లక్షల జీతం చెల్లిస్తారు. అంతేకాదు వారికి అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఈ పది రోజుల్లో ఉద్యోగులు హాయిగా నిద్రపోతూ వారికిష్టమైన సినిమాలు చూస్తూ సమయాన్ని గడపవచ్చు.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ పడకపై పడుకున్న వ్యక్తులు ఎంత సౌకర్యంగా ఉన్నారు? వారి శరీరంలోని అన్ని భాగాలు విశ్రాంతి తీసుకుంటున్నాయా? వారు గాఢంగా నిద్రపోతున్నారా లేదా మగతగా ఉన్నారా అనే విషయాలను ఈఎస్ఏ ప్రతినిధులు నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు. ఉద్యోగి గాఢ నిద్రలో ఉంటే ఉత్పత్తి నాణ్యమైనదని, ఒకవేళ మగత నిద్రలో ఉంటే ఇంకా మార్పులు చేయాలని వారు భావిస్తారు. ఈ పరిశీలనల ఆధారంగా వారు తమ ఉత్పత్తిని మరింత మెరుగుపరుస్తారు.
ముఖ్యంగా, అంతరిక్ష ప్రయాణంలో మానవ శరీరం ఎదుర్కొనే ఒత్తిడిని అంచనా వేయడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు ఈఎస్ఏ తెలిపింది. ఈ పరిశోధన ద్వారా, అంతరిక్షంలో వ్యోమగాముల సౌకర్యం కోసం మరింత మెరుగైన ఉత్పత్తులను రూపొందించడానికి ఈఎస్ఏ ప్రయత్నిస్తోంది.