Begin typing your search above and press return to search.

జాబ్ కోసం వెయిట్ చేస్తున్నోళ్లకు పండుగ లాంటి వార్త

By:  Tupaki Desk   |   2 Aug 2023 4:38 AM GMT
జాబ్ కోసం వెయిట్ చేస్తున్నోళ్లకు పండుగ లాంటి వార్త
X

కొత్త సంవత్సరం వచ్చేయటం.. అప్పుడే ఏడు నెలలు గడిచిపోవటం.. ఆగస్టులోకి ఎంట్రీ ఇవ్వటం చాలా వేగంగా జరిగిపోయినట్లుగా అనిపిస్తోంది. గతంలో ఏడాది అంటే.. చాలా నెమ్మదిగా సాగినట్లుగా ఉండేది. మారిన పరిస్థితులు.. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత.. మనిషి జీవనయానాన్ని మరింత వేగంగా మార్చేశాయని చెప్పాలి. ఇదంతా ఎందుకంటే.. ఆగస్టు వచ్చిందంటే పండుగల సీజన్ మొదలైనట్లే.

స్నేహితుల దినోత్సవం.. శ్రావణ మాసం.. పంద్రాగస్టు.. ఓనమ్.. రక్షా బందన్.. జన్మాష్టమి.. వినాయకచవితి.. దుర్గాష్టమి.. దసరా.. దీపావళి.. క్రిస్మస్.. కొత్త ఏడాది.. సంక్రాంతి వరకు బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా పండుగలు వరుస పెట్టేస్తుంటాయి. పంద్రాగస్టుతో మొదలయ్యే కొనుగోళ్ల హడావుడి న్యూఇయర్ వరకు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు తాత్కాలిక ఉద్యోగాలు పెద్ద ఎత్తున లభిస్తాయని మాన్ పవర్ గ్రూప్ ఇండియా.. టీమ్ లీజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఆగస్టు చివరి వారం నుంచి డిసెంబరు వరకు రికార్డు స్థాయిలో 6లక్షల నుంచి 7 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది పండుగ సీజన్ లో వచ్చిన జాబ్స్ తో పోలిస్తే ఈసారి మరో 20 శాతం పెరుగుతాయని చెబుతున్నారు. పరిశ్రమల అంచనా ప్రకారం దేశంలో 30-35 లక్షల వరకు తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. వీరికి అదనంగా మరో ఆరేడు లక్షల మంది ఈ నాలుగు నెలలకు రిక్రూట్ చేస్తారని చెబుతున్నారు.

ద్రవ్యోల్బణం ఇబ్బంది పెడుతున్నా.. ఆఫర్ల కాలం.. పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ప్రజలు సిద్ధం కావటంతో అందుకు తగ్గట్లు సంస్థలు కూడా సిద్ధమవుతాయని చెబుతున్నారు. రిటైల్.. బ్యూటీ.. ఫ్యాషన్.. లైఫ్ స్టైల్.. ఇ కామర్స్.. లాజిస్టిక్స్ రంగాల్లో పలు కంపెనీలు తాత్కాలిక నియామకాలు చేపడతాయి. సహాయక సిబ్బంది.. వేర్ హౌస్ లో పికర్స్.. పాకర్స్.. డెలివరీ సిబ్బంది.. లోన్ఎగ్జిక్యూటివ్ లాంటి తాత్కాలిక ఉద్యోగాలకు సంబంధించి బోలెడన్ని ఆఫర్లు వెల్లువెత్తుతాయని చెబుతున్నారు.