Begin typing your search above and press return to search.

వరల్డ్‌ వర్క్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ లో మన స్థానం ఇదే!

మన దేశంలోని ఉద్యోగులు.. స్థిరత్వం (ఫ్లెక్సిబులిటీ), మానసిక ప్రశాంతత, సమర్థవంతమైన నాయకత్వం వంటి వాటిని కలిగి ఉండటం ద్వారా సంతోషంగా ఉన్నారని తేలింది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 3:30 PM GMT
వరల్డ్‌ వర్క్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ లో మన స్థానం ఇదే!
X

ఉద్యోగం సాధించడం ఒక వంతు అయితే ఆ ఉద్యోగాన్ని ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా ఆడుతూ పాడుతూ చేయడం ఒక వంతు. అందుకే ఒక సినీ కవి.. 'ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది'.. అంటూ ఒక పాట రాశాడు. ఇప్పుడు మన భారతీయ ఉద్యోగులు కూడా కవి కాంక్షించినట్టే ఆడుతూ పాడుతూ తమ ఉద్యోగాలను చేస్తున్నారని వెల్లడైంది. ఆనందంగా పనిచేయడంలో భారతీయులు కూడా మిగిలిన దేశాలతో పోలిస్తే ముందు వరుసలోనే ఉన్నారని తేలింది.

పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే ఆ పని ఏదైనా సులువు అవుతుందని నానుడి. ఈ నేపథ్యంలో ఏ దేశంలో ఉద్యోగులు సంతోషంగా పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి 'హెచ్‌పీ రిలేషన్‌ షిప్‌ ఇండెక్స్‌' సర్వే నిర్వహించింది. ఇందుకోసం మొత్తం 12 దేశాల్లోని 15,600 ఐటీ ఉన్నతాధికారులు, బిజినెస్‌ లీడర్స్, ఉద్యోగుల అభిప్రాయాలు స్వీకరించింది.

ఇందులో భాగంగా మనదేశం నుంచి ఈ సర్వేలో 1300 మంది పాల్గొన్నారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ మంది తాము పనిని ఆనందంగా చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో హెచ్‌పీ రిలేషన్‌ షిప్‌ ఇండెక్స్‌ లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు.

కాగా హెచ్‌పీ వర్క్‌ రిలేషన్‌ షిప్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 27 శాతం మంది ఉద్యోగం చేయడంలో ఆనందాన్ని పొందుతున్నట్లు వెల్లడైంది. మన దేశంలోని ఉద్యోగులు.. స్థిరత్వం (ఫ్లెక్సిబులిటీ), మానసిక ప్రశాంతత, సమర్థవంతమైన నాయకత్వం వంటి వాటిని కలిగి ఉండటం ద్వారా సంతోషంగా ఉన్నారని తేలింది. దీనికి తగినట్లుగానే ఆయా కంపెనీల యాజమాన్యాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయని స్పష్టమైంది.

కేవలం ఎక్కువ జీతాలు తీసుకునేవారు మాత్రమే కాకుండా తక్కువ జీతాలు పొందే ఉద్యోగులు సైతం తమ పనిపట్ల సంతోషంగా ఉన్నారని తేలింది. ముఖ్యంగా మనదేశంలో చాలా మంది ఇంకా తమ ఉద్యోగాల్లో చాలా తక్కువ జీతాలే పొందుతున్నారు. అయినప్పటికీ వారు ఆనందంగా ఉన్నారు. పని అనుభవం, ఉద్యోగంలో నైపుణ్యం సాధించడం వంటి కారణాలతో వారు చాలా సంతోషంగా ఉన్నారని సర్వే తెలిపింది.

ఈ సర్వేలో భారత్‌ అగ్రస్థానం నిలవగా జపాన్‌ అట్టడుగున నిలిచింది. ఆ దేశంలో ఉద్యోగులు తమ పని పట్ల ఆనందంగా లేరని వెల్లడైంది. ఈ ఏడాది జూన్‌ 9– జూలై 9 మధ్య ప్రముఖ కంపెనీ హెచ్‌పీ ఈ సర్వే నిర్వహించింది. ఫ్రాన్స్, కెనడా, యునైటెడ్‌ కింగ్‌ డమ్, జర్మనీ, భారత్, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, స్పెయిన్‌ దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు.