Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ లో 400 మంది తొలగింపు.. 6 గంటల్లోపు వెళ్లిపోవాలని అల్టిమేటం!

ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ విషయంలో ఆ మధ్య విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ లో 400 మంది ట్రైనీలకు లేఆఫ్ లు ప్రకటించినట్లు జాతీయ మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి

By:  Tupaki Desk   |   7 Feb 2025 3:00 PM GMT
ఇన్ఫోసిస్ లో 400 మంది తొలగింపు.. 6 గంటల్లోపు వెళ్లిపోవాలని అల్టిమేటం!
X

ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ విషయంలో ఆ మధ్య విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ లో 400 మంది ట్రైనీలకు లేఆఫ్ లు ప్రకటించినట్లు జాతీయ మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి. ఈ సమయంలో తొలగించబడ్డ ట్రైనీల ఆవేదన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవాల్యూషన్ పరీక్ష పేరు చెప్పి తమను తొలగిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

అవును... 2022-23 రిక్రూట్మెంట్ లో భాగంగా 2000 మంది ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఎంపిక చేసింది. వారంతా 2022లో పాస్ అవుట్ అయినవారు కాగా.. సిస్టం ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ తదితర పోస్టులకు వారిని ఎంపిక చేస్తూ, అదే ఏడాది వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చింది సంస్థ. అయితే వారిని విధుల్లోకి తీసుకోవడానికి మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చారు.

దీంతో... ఇన్ఫోసిస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు సైతం నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో... సుమారు రెండేళ్లు ఆలస్యంగా గత ఏడాది ఏప్రిల్ లో వారిని విధుల్లోకి తీసుకుంది. అంటే... వీరంతా 2022లో ఆఫర్ లెటర్స్ తీసుకుంటే 2024లో ఉద్యోగాలు వచ్చాయన్నమాట.

అయితే అనూహ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సుమారు 400 మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని మైసూరు క్యాంపస్ లో ట్రైనీలుగా ఉన్న వీరంతా వరుస ఎవాల్యూషన్ పరీక్షల్లో విఫలమయ్యారని.. అందుకే విధుల నుంచి తొలగించినట్లు చెబుతున్నారట. వీరిలో సంగం మంది 2024 అక్టోబర్ లో ట్రైనీలుగా చేరినవారని అంటున్నారు.

ఇదే సమయంలో... ట్రైనీలను బ్యాచ్ ల వారీగా పిలిచి వారితో "మ్యూచువల్ సెపరేషన్" లెటర్స్ పై సంతకాలు చేయించుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఉద్వాసనకు గురైన ట్రైనీ ఒకరు మాట్లాడుతూ.. తాము ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఆ పరీక్షలను కఠినంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు.

అదేవిధంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోనే ఉద్వాసనకు గురైన ట్రైనీలంతా క్యాంపస్ వీడాలని అల్టిమేటం జారీ చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాజా వ్యవహారంపైనా కార్మిక శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే... ఈ పరిణామంపై ఇన్ఫోసిస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు!