లే ఆఫ్ లతో దడపుట్టిస్తున్న ఐటీ కంపెనీలు !
ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 5 May 2024 5:30 PM GMTఇంజనీరింగ్ చేస్తే కొలువు గ్యారంటీ అన్న విద్యార్థులతో పాటు ఇప్పటికే కొలువుల్లో ఉన్న టెకీలకు ఐటీ కంపెనీల నిర్ణయాలు దడ పుట్టిస్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల నుండి ఐటీ కంపెనీలు ఈసారి కేవలం 70,000-80,000 మందిని మాత్రమే నియమించుకొనే అవకాశాలున్నాయి. ఏకంగా ప్రతిష్టాత్మక ఐఐటీ ముంబయి నుండే క్యాంపస్ ప్లేస్ మెంట్లు పడిపోవడం దీనికి నిదర్శనం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 15 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా అందుకోనుండగా, ఇందులో 10 శాతం కంటే తక్కువ మందే క్యాంపస్ ప్లేస్‌మెంట్లు దక్కించుకొనే అవకాశం ఉన్నది. ఈ ప్రభావం టైర్-2 కాలేజీలపై భారీగా పడనున్నది. ముఖ్యంగా ప్లేస్‌మెంట్లపైనే ఆధారపడి నడిచే అనేక కాలేజీలు తీవ్రంగా నష్టపోనున్నాయి.
వరుసగా రెండో ఏడాది కూడా ఇన్ఫోసిస్, విప్రో క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. టీసీఎస్ కూడా తక్కువ మందినే నియమించుకుంటామని ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్‌బుక్, అమెజాన్ మొదలుకొని చిన్నాచితక కంపెనీల దాకా అన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాదిలాగే ఈసారి కూడా ఈ వ్యవహారం కొనసాగుతున్నది. ఈ ఏడాది జనవరిలోనే అన్ని కంపెనీలు కలిపి 30 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ నెల 3వ వరకు 122 సాఫ్ట్‌వేర్ కంపెనీలు 31,751 మందిని ఇండ్లకు పంపడం గమనార్హం.