Begin typing your search above and press return to search.

ఏడాదిలో అంతమందిని ఇంటికి పంపిన ఐటీ దిగ్గజాలు!

కరోనా వేళలో వెలిగిపోయిన ఐటీ రంగం గడిచిన కొంతకాలంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.

By:  Tupaki Desk   |   20 April 2024 6:30 AM GMT
ఏడాదిలో అంతమందిని ఇంటికి పంపిన ఐటీ దిగ్గజాలు!
X

కరోనా వేళలో వెలిగిపోయిన ఐటీ రంగం గడిచిన కొంతకాలంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఆ మాటకు వస్తే.. కొంతకాలంగా సంక్షోభంలో కిందామీదా పడుతున్నట్లుగా చెప్పాలి. దీంతో దిగ్గజ కంపెనీలు సైతం తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా ఐటీ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు ఇటీవల కాలంలో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని కోల్పోతున్నారు.

తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం ఏడాది వ్యవధిలో ఐటీ దిగ్గజ కంపెనీలు తమ వద్ద పని చేసే ఉద్యోగుల్లో ఎంత మందిని ఇంటికి పంపారన్న దానిపై క్లారిటీ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో మూడు ఆగ్రశ్రేణి ఐటీ దిగ్గజ కంపెనీలు భారీగా తమ ఉద్యోగుల్నితొలగించినట్లుగా వెల్లడైంది. ఇంతకు ఆ మూడు కంపెనీలేమంటే.. టీసీఎస్.. ఇన్ఫోసిస్.. విప్రో. ఈ మూడు కంపెనీలు ఏడాది వ్యవధిలో 64 వేల మందిని ఇంటికి పంపించినట్లుగా చెప్పాలి.

ఇందులో మొదటిస్థానం ఇన్ఫోసిస్ నిలిస్తే.. రెండో స్థానంలో విప్రో.. మూడో స్థానంలో టీసీఎస్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2023 - మార్చి 2024) మధ్యలో ఇన్ఫోసిస్ 24,994 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికితే.. విప్రో 24,516 మందిని.. టీసీఎస్ 13,244 మందిని ఇంటికి పంపించాయి. ఇక.. చిన్న మధ్యతరహా కంపెనీలు తీసేసిన ఉద్యోగుల్ని కూడా కలుపుకుంటే విధుల నుంచి తొలగించిన ఉద్యోగుల సంఖ్య లక్షకు పైనే ఉంటుందని చెబుతున్నారు.

ఇంతకూ ఈ పరిస్థితికి కారణం ఏమిటన్నది చూస్తే.. అమెరికా.. ఐరోపా దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తటంతో పాటు.. కంపెనీలకు రావాల్సిన ప్రాజెక్టులు తగ్గటం కూడా కారణమని చెబుతున్నారు. మాంద్యం పరిస్థితుల్లో కంపెనీలు తమ ఐటీ బడ్జెట్ లను గణనీయంగాతగ్గిస్తున్నారు. దీని ప్రభావం ఐటీ కంపెనీల మీద పడుతోంది. తమకు తగ్గుతున్న ఆదాయాలకు తగ్గట్లు ఉద్యోగుల్లో కోత పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగుల్లో అత్యధికులు.. సరికొత్త టెక్నాలజీలను నేర్చుకోకపోవటం కూడా కారణమని చెప్పాలి. మొత్తంగా ఐటీ రంగం ఎన్ని ఇబ్బందుల్లో ఉందన్న విషయాన్ని తాజా రిపోర్టు కళ్లకు కట్టినట్లుగా వివరాల్ని వెల్లడించిందని చెప్పాలి.