Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ ఎఫెక్ట్... ఐటీ ఉద్యోగులకు మూడు విడతల్లో లాగ్‌ అవుట్‌!

అవును... వర్షాల కారణంగా హైదరాబాద్‌ లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   26 July 2023 4:42 AM GMT
ట్రాఫిక్  ఎఫెక్ట్... ఐటీ ఉద్యోగులకు మూడు విడతల్లో లాగ్‌  అవుట్‌!
X

వర్షాలు వస్తే హైదరబాద్ పరిస్థితి దాదాపు అక్కడుండే అందరికీ తెలిసిందే. ఒక మోస్తారు వర్షాలు వస్తేనే హైదరబాద్ రోడ్లు నీటితో నిండిపోతాయి. ఇక ప్రస్తుతం కురుస్తున్న ఎడతెరిపి లేని వానలు వస్తే ఇక చెప్పే పనిలేదు! విశ్వనగరం లో రోడ్లు, కాలువలను తలపిస్తుంటాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్‌ నరకం చూపిస్తుంది!

దీంతో ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విపరీతంగా వాహన రాకపోకల ఫలితంగా ట్రాఫిక్ జామ్‌ ఎక్కువగా అవుతోందని పోలీసు శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా... అన్ని కంపెనీల ఉద్యోగులూ ఒకేసారి ఆఫీసు బయటకు రాకుండా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... వర్షాల కారణంగా హైదరాబాద్‌ లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మూడు రోజులూ... ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు మూడు దశల్లో లాగ్‌ అవుట్‌ చేసుకోవాలని సైబరాబాద్‌ పోలీసులు సూచించారు.

గ్రేటర్‌ వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షానికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. విపరీతమైన వాహన రద్దీతో జూబ్లీహిల్స్‌, అమీర్‌ పేట ప్రాంతాల్లో అంబులెన్సులకు దారి దొరకని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో మరి ముఖ్యంగా ఆఫీసులు మూతపడే సమయంలో కుంభవృష్టిగా వాన కురవడంతో ప్రజలు నరకం చూడాల్సిన పరిస్థితి.

ఈ సమయంలో భారీ వర్షాల నేపథ్యంలో అత్తాపూర్‌, శివరాంపల్లి, హైటెక్‌ సిటీ, మలక్‌ పేట రైల్వే స్టేషన్‌, నాగోల్‌, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోని రోడ్లపై నడుములోతు నీటితో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఎటు చూసినా రోడ్లపై వాహనాల బారులే కనిపించాయి. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు సైబరాబాద్‌ పోలీసులు ప్రణాళిక రూపొందించారు.

ఇందులో భాగంగా... ఫేజ్ - 1 లో భాగంగా... ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. ఫేజ్ - 2 లో భాగంగా ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

ఇక, ఫేజ్ - 3 లో భాగంగా... ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని సైబరాబాద్‌ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.