Begin typing your search above and press return to search.

ఆఫీసుకు రాలేదో 'లీవ్'తో కట్.. ఉద్యోగులకు ఐటీ దిగ్గజం షాక్

By:  Tupaki Desk   |   20 July 2024 10:17 AM GMT
ఆఫీసుకు రాలేదో లీవ్తో కట్.. ఉద్యోగులకు ఐటీ దిగ్గజం షాక్
X

కరోనా పుణ్యమా అని ఉద్యోగులకు వరంగా మారింది వర్కు ఫ్రం హోం. ఇంటి నుంచి పని చేయటం మొదట్లో బాగానే అనిపించినా.. తర్వాతి రోజుల్లో కొందరు ఉద్యోగులకు బోరింగ్ గా మారింది. మొదట్లో ఉద్యోగులు శ్రద్ధ పెట్టి పని చేయటంతో ఉత్పాదకత బాగానే ఉన్నా.. తర్వాతి రోజుల్లో ఆశించినంత ఫలితాలు కనిపించని పరిస్థితి. అదేసమయంలో ప్రభుత్వాలు సైతం ఉద్యోగులను ఇంటి నుంచి ఆఫీసులకు వచ్చేలా కంపెనీలకు ఫర్మానాలు జారీ చేశాయి. దీంతో ఉద్యోగుల్ని ఇంటి నుంచి ఆఫీసుకు రప్పించేందుకు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి.

రెండు మూడేళ్ల పాటు నాన్ స్టాప్ గా ఇంటి నుంచి పని చేసిన ఐటీ ఉద్యోగులు పలువురికి ఆఫీసుకు రావటం కష్టంగా మారింది. దీంతో.. ఏదో ఒకటి చెప్పి ఆఫీసుకు రాకుండా మేనేజ్ చేయటం మొదలైంది. దీంతో.. హైబ్రిడ్ విధానంలో వారానికి మూడు రోజులు కచ్ఛితంగా ఆఫీసుకు రావాలంటూ ఆదేశాలు జారీ చేశాయి. అయినప్పటికీ ఏదో ఒక మాట చెప్పి తప్పించుకోవటం అలవాటుగా మారింది కొందరు ఉద్యోగులకు.

అలాంటి వారిని దారికి తెచ్చేందుకు దిగ్గజ ఐటీ సంస్థ హెచ్ సీఎల్ సరికొత్త ఎత్తుడగను తెర మీదకు తీసుకొచ్చింది. తాము చెప్పినట్లుగా వారానికి మూడు రోజుల పాటు ఆఫీసుకు రాకుంటే.. రాని రోజును లీవ్ కింద పరిగణలోకి తీసుకుంటామన్న పాలసీని తెర మీదకు తెచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం హెచ్ సీఎల్ ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు చొప్పున ఆఫీసుకు వచ్చి పని చేయాలి. నెలకు పన్నెండు రోజుల పాటు ఆఫీసుల నుంచి పని చేయాలి. అంతకంటే తక్కువ రోజులు ఆఫీసుకు వస్తే.. రాని రోజుల్ని లీవ్ గా పరిగణించాలని నిర్ణయించాయి.

దీనికి సంబంధించి హెచ్ ఆర్ డిపార్టుమెంట్ కు సమాచారం వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. లీవులన్ని పూర్తి అయిన తర్వాత కూడా ఆఫీసుకు రాకుంటే లాస్ ఆఫ్ పేగా పరిగణలోకి తీసుకొని.. శాలరీని కట్ చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం హెచ్ సీఎల్ ఉద్యోగుల్లో మూడేళ్ల లోపు పని చేస్తున్న వారికి ఏటా పద్దెనిమిది సెలవులు.. ఒక పర్సనల్ లీవ్ ఉంటుంది. మూడేళ్లకు పైబడిన వారికి 20+2 లీవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వారంలో మూడు రోజులు కచ్ఛితంగా ఆఫీసుకు రావాలన్న రూల్ ను అమల్లోకి తీసుకొచ్చేశారు. దీంతో.. ఉద్యోగి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. మరి.. ఈ రూల్ కు హెచ్ సీఎల్ ఉద్యోగులు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.