గత ఏడాది రోజుకు 40, ఈసారి 49... టెన్షన్ పెడుతున్న లేఆఫ్స్.ఎఫ్‌వైఐ!
క్రితం ఏడాది ఇదే సమయంలో ఉద్యోగుల తొలగింపులు 8,740గా ఉన్నట్లు పేర్కొంది.
By: Tupaki Desk | 23 Oct 2023 1:04 PM GMTటెక్ కంపెనీల్లో ఉద్యోగుల పరిస్థితి గడిగడి గండంగా ఉందని.. నూరేళ్ల ఆయుష్షులా మాత్రం లేదని అందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో గతేడాదితో పోలిస్తే ఉద్యోగాల తొలగింపు తీవ్రతరం అవుతుండగా... అత్యధికంగా స్టార్టప్ లే ఉన్నాయని తెలిస్తుంది. ఈ సమయంలో గతేడాది లేఆఫ్ లు ఎలా ఉన్నాయి.. ఏ ఏడాది ఇప్పటివరకూ ఎలా ఉన్నాయి.. మొదలైన విషయాలు తాజాగా తెరపైకి వచ్చాయి.
అవును... 2022తో పోలిస్తే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత టెక్నాలజీ కంపెనీలు అత్యధిక మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ అనే నివేదిక తెలిపింది. ఈ నివేధిక ప్రకారం ఇప్పటి వరకు 14,418 మందికి వివిధ సంస్థలు ఉద్వాసన పలకగా... క్రితం ఏడాది ఈ సంఖ్య 14,224గా ఉన్నట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. ఇదే సమయంలో తమ సర్వేలో అత్యధికంగా స్టార్టప్ లే ఉన్నాయని సంస్థ తమ నివేదికలో తెలిపింది.
ఇక సగటున రోజుకి ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారనే వివరాలు కూడా సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా... గత ఏడాది సగటున రోజుకు 40 మంది ఉద్యోగాలు కోల్పోగా.. ఈసారి ఆ సంఖ్య 49గా నమోదైనట్లు వెల్లడించింది. ఇదే సమయంలో... ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సుమారు 60 శాతం మంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నవారని సంస్థ వెల్లడించింది.
ఇలా లేఆఫ్ లు ఇస్తున్న కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో బెంగళూరు తర్వాత స్థానాల్లో గురుగ్రాం (16 శాతం), ముంబయి (11 శాతం), చెన్నై, ఢిల్లీలు ఉన్నట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ పేర్కొంది. ఇందులో భాగంగా ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే 13,978 మందిని తొలగించినట్లు సంస్థ పేర్కొంది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఉద్యోగుల తొలగింపులు 8,740గా ఉన్నట్లు పేర్కొంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు తొలగిస్తున్న కంపెనీలు ఉన్న దేశాల్లో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అవును... ఈ ఏడాది అమెరికాలో అత్యధికంగా ఉద్యోగుల తొలగింపులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా... ప్రపంచ వ్యాప్తంగా తొలగింపుల్లో 70 శాతం ఉద్యోగాలు అమెరికాలోనే రికార్డవ్వడం గమనార్హం. ఇక రంగాలవారీగా చూస్తే అత్యధికంగా ఎడ్యుటెక్ సంస్థలు ఉద్యోగులను తొలగించాయి.
ఇలా ఉద్యోగుల తొలగింపులో అమెరికా తర్వాత స్థానాల్లో... భారత్, జర్మనీ, స్వీడన్, యూకే, నెదర్లాండ్స్, కెనడా ఉన్నాయి. బ్రెజిల్, ఆస్ట్రేలియా, చైనా లోనూ గణనీయ తొలగింపులు జరిగినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ పేర్కొంది. యూఎస్ తర్వాత భారత్ లో నమోదైన ఉద్యోగాల కోతల్లో 30 శాతం ఎడ్యుటెక్ రంగం నుంచే ఉండటం గమనార్హం. దీని తర్వాత ఆహార తయారీ సంస్థలు, కన్జ్యూమర్, రిటైల్, ఆరోగ్య సంరక్షణ కంపెనీలున్నాయి.