ఐటీలో కొత్త ట్రెండ్.. జీతం పెరగాలంటే పరీక్ష పాస్ అవ్వాల్సిందే
ఉపాధి అవకాశాలకు ఎన్నోరంగాలు ఉన్నప్పటికి ఐటీ స్ట్రీమ్ కు ఉన్న గ్లామర్ మరే ఉద్యోగాలకు లేదనే చెప్పాలి.
By: Tupaki Desk | 1 March 2025 5:30 AM GMTఉపాధి అవకాశాలకు ఎన్నోరంగాలు ఉన్నప్పటికి ఐటీ స్ట్రీమ్ కు ఉన్న గ్లామర్ మరే ఉద్యోగాలకు లేదనే చెప్పాలి. పని ఒత్తిడి ఎంత ఉందన్నది పక్కన పెడితే.. కళ్లు చెదిరే జీతం ఐటీ రంగంలో కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు ఆయా టెక్ కంపెనీలు కల్పించే వసతులు చూసిన ప్రతి ఒక్కరు ఆసూయతో రగిలిపోయేలా చేస్తూ ఉంటుంది. అయితే.. సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి అన్నట్లుగా.. పైకి గొప్పగా కనిపించే ఐటీ ఉద్యోగాల్లో ఉండే సవాళ్లు అన్ని ఇన్ని కావు.
కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవటం.. తమకున్న నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవటం.. ఇందుకోసం వయసుతోనూ.. అనుభవంతోనూ సంబంధం లేకుండా ఆయా కోర్సుల్ని పూర్తి చేయాల్సి రావటం.. కొత్తగా వచ్చే అప్లికేషన్ల మీదా అవగాహనను పెంచుకోవటం తప్పనిసరి. అప్పుడు మాత్రమే ఉద్యోగ జీవితంలో ఎదిగే వీలుంది. ఇదిలా ఉంటే.. ఐటీ ఉద్యోగుల జీతాల పెంపు వ్యవహారంలో మరో కొత్త అంశం ఇప్పుడు ట్రెండ్ గా మారిందంటున్నారు.
తాజాగా ఎల్ టీఐ మైండ్ ట్రీ సంస్థ తన ఉద్యోగుల జీతాల పెంపునకు కొత్త మెలిక పెట్టింది. అదేమంటే.. తమ దగ్గర పని చేసే మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన పెంపును సామర్థ్య పరీక్షఉత్తీర్ణతను లింకు పెట్టింది. కంపెనీ వార్షిక అప్రైజల్ కసరత్తులో భాగమైన ఇదంతా ఎందుకన్న దానిపై సంస్థ స్పష్టత ఇస్తోంది. తమ పాత్రల్లో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు.. కొత్త టెక్నాలజీల అవగాహన ఉండాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
మిడిల్.. సీనియర్ లెవల్ మేనేజర్లకు తప్పనిసరిగా నిర్వహించే ఈ పోటీ పరీక్షలో కోడింగ్.. మ్యాథ్స్.. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ తో సహా పలు నైపుణ్యాలను అంచనా వేస్తారు. టీంలను లీడ్ చేసే విషయంలోనూ.. సంస్థ ఎదుగుదలకు అవసరమైన సాంకేతిక.. నిర్వహణ సామర్థ్యాల్ని అంచనా వేసేందుకు వీలుగా ఈ టెస్టును రూపొందించినట్లు చెబుతున్నారు. నాలుగేళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న వారికి ఈ పరీక్షలు నిర్వహించి.. దాని ఫలితాల ఆధారంగా జీతాల పెంపు ఉంటుందని చెబుతున్నారు.
ఈ తరహా నిర్ణయం తీసుకున్న మొదటి భారత ఐటీ సంస్థగా ఎల్ టీఐ మైండ్ ట్రీ గా చెబుతున్నారు. పని తీరులో మదింపు.. నైపుణ్యాల ఆధారంగా వ్యవహరించే ఈ ప్రక్రియకు మిగిలిన కంపెనీలు అనుసరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే జరిగితే ఉద్యోగుల్లో మరింత ఒత్తిడిని పెంచుతుందని చెబుతున్నారు. ఈ తీరుపై ఐటీ ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
అదనపు ఒత్తిడి.. వేతనాల పెంపుపై ప్రభావం చూపుతుందని.. సామర్థ్యం మాత్రమే కాదు. జీతాల పెంపు వెనుక చాలానే అంశాలు ఉంటాయని.. ఈ పరీక్షల పేరుతో మరింత వేధింపులకు గురి చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ పరీక్ష నిష్పాక్షికంగా ఉండేలా ప్లాన్ చేశామని.. వారు ప్రిపేర్ అయ్యేందుకు తగిన సహకారం.. వనరులు అందజేస్తామని ఉద్యోగులకు సదరు సంస్థ హామీ ఇచ్చిందని చెబుతున్నారు.