స్వీట్ న్యూస్ చెప్పిన సర్వే రిపోర్టు.. 3 నెలల్లో భారీగా జాబ్స్
భయపెడుతున్న మాంద్యం.. ఊడిపోతున్న కొలువులు.. సర్వత్రా ఆలుముకున్న అనిశ్చితి వేళ.. కొత్త ఆశలు కలిగించే ఒక సర్వే రిపోర్టు విడుదలైంది.
By: Tupaki Desk | 13 Sep 2024 8:30 AM GMTభయపెడుతున్న మాంద్యం.. ఊడిపోతున్న కొలువులు.. సర్వత్రా ఆలుముకున్న అనిశ్చితి వేళ.. కొత్త ఆశలు కలిగించే ఒక సర్వే రిపోర్టు విడుదలైంది. రానున్న మూడు నెలల్లో పెద్ద ఎత్తున కొలువులు భర్తీ కానున్నట్లుగా పేర్కొన్న వైనం చూసినప్పుడు ఇదో గుడ్ న్యూస్ గా భావించక తప్పదు. మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వే క్యూ4, 2004 నివేదిక ప్రకారం.. భారత కంపెనీలు రానున్న మూడు నెలల్లో పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్లు చేపడతాయని పేర్కొంది. దాదాపు 37 శాతం భారత కంపెనీలు అక్టోబరు - డిసెంబరు మధ్య కొత్త కొలువులకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు.
తమ సిబ్బందిని పెంచుకోవటానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది జులై - సెప్టెంబరు కాలంతో పోలిస్తే.. అక్టోబరు - డిసెంబరు మధ్య మూడు నెలల కాలంలో 7 శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే తటస్థంగా ఉందని నివేదిక పేర్కొంది. సర్వేలో భాగంగా 3150 కంపెనీల అభిప్రాయాల్ని తీసుకున్నారు. భారత్ తర్వాత కోస్టారికాలో అత్యధికంగా 36 శాతం కంపెనీలు.. యూఎస్ లో 34 శాతం కంపెనీలు నియామకాల పట్ల పాజిటివ్ గా ఉన్నట్లుగా తేల్చారు. సిబ్బందిని తగ్గించుకునే కంపెనీలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే నికర నియామకాల గణాంకాల్ని ఈ రిపోర్టులో రెడీ చేశారు.
కొత్త రిక్రూట్ మెంట్లను చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల ధోరణి ఎంతన్న విషయాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు. అధిక యువ జనాభా కలిగిన దేశంగా.. మనకున్న సానుకూలతలు అంతర్జాతీయ మార్కెట్లో భారత పోటీతత్వాన్ని పెంచుతాయని చెబుతున్నారు. ఈ సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే.. ఏయే రంగాల్లో ఏ మేర నియామకాలు ఉంటాయన్న విషయాన్ని పేర్కొన్నారు.
ఫైనాన్షియల్.. రియల్ ఎస్టేట్ రంగాల్లో వచ్చే 3 నెలల్లో 47 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉంటే.. ఐటీలో 46 శాతం.. ఇండస్ట్రియల్స్.. మెటీరియల్స్ రంగాల్లో 36 శాతం.. కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో 35 శాతం సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నారు. అతి తక్కువ రిక్రూట్ మెంట్ కమ్యునికేషన్ రంగంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక.. ఉత్తరాదిలో ఉద్యోగాల డిమాండ్ 41 శాతం ఉండగా.. పశ్చిమాన 39 శాతంగా ఉంది.