Begin typing your search above and press return to search.

కోతలు మొదలు పెట్టిన మైక్రోసాఫ్ట్.. ఈసారి ఎంతమంది అంటే?

మంచి కానీ చెడు కానీ దిగ్గజ తీసుకునే నిర్ణయాలు సంబంధిత రంగాలకు చెందిన మిగిలిన కంపెనీలకు ఒక దిశానిర్దేశంగా మారుతుంటాయి

By:  Tupaki Desk   |   5 July 2024 3:50 AM GMT
కోతలు మొదలు పెట్టిన మైక్రోసాఫ్ట్.. ఈసారి ఎంతమంది అంటే?
X

మంచి కానీ చెడు కానీ దిగ్గజ తీసుకునే నిర్ణయాలు సంబంధిత రంగాలకు చెందిన మిగిలిన కంపెనీలకు ఒక దిశానిర్దేశంగా మారుతుంటాయి. ఒక వ్యూహంలో భాగంగా పెద్ద కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయి కాబట్టి.. మనం ఆ బాటలోనే నడుద్దామన్నట్లుగా వాతావరణం మారుతుంది. ఏతావాతా సదరు రంగం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పాజిటివ్ అంశాల మీద ఇలాంటి రియాక్షన్లు తక్కువగా ఉంటాయి కానీ.. నెగిటివ్ అంశాల మీద మాత్రం సత్వరమే స్పందించే తీరు ఉంటుంది. ఓవైపు మాంద్యం.. మరోవైపు యుద్ధాలు.. ఇంకోవైపు ఏఐ.. వెరసి ఐటీ రంగం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతోంది. పెరిగిన వ్యయాల్ని సర్దుబాటు చేసుకోవటం కోసం ఉద్యోగుల్ని ఇళ్లకు పంపేలా పలు కంపెనీలు నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.

గడిచిన రెండేళ్లుగా ఐటీ రంగంలో లేఆఫ్ లు ఎక్కువై పోయాయి. దీంతో.. ఈ పరిస్థితిలో మార్పు ఎప్పటికి వస్తుందన్నది పెద్ద ఆందోళనగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఐటీ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ తాజాగా తన ఉద్యోగుల్లో కొందరిని ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్న వివిధ టీంలకు చెందిన వారిని తాజా రౌండ్ లో తొలగించినట్లుగా గ్రీక్ వైర్ మీడియా సంస్థ వెల్లడించింది. ఇదిప్పుడు టెక్ ప్రపంచంలోనూ.. ఐటీ రంగంలోనూ పెను సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే.. లేఆఫ్ లకు గురైన ఉద్యోగులు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే రంగాల్లో లేఆఫ్ లు ప్రకటించారన్న దానిపై కొంత సమాచారం బయటకు వస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా తొలగింపులపై మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిది స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వ్యాపారం అన్న తర్వాత ఎప్పటికప్పుడు మార్పులు సర్వసాధారణమని.. కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళలో.. పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టినట్లుగా పేర్కొన్నారు.

లేఆఫ్ లను ప్రకటించటం సంస్థలో ఇదే తొలిసారి కాదన్న కంపెనీ.. ఎంతమందిని తాజాగా ఇంటికి పంపిన వైనంపై మాత్రం ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. ఈ ఏడాది జనవరిలో గేమింగ్ డివిజన్ లో 2 వేల మందిని తొలగించినట్లుగా సమాచారం బయటకు వచ్చింది. ఈ మధ్యన సంస్థకు చెందిన అజ్యూర్.. మిక్సెడ్ రియాలిటీ విభాగానికి చెందిన వెయ్యి మందిని జూన్ లో తొలగించారు. తాజా లేఆఫ్ లు గత నెలకు అదనమన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇదిలా ఉంటే.. గత ఏడాదిలో దాదాపు 5 వేల మంది వరకు ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ ఇంటికి పంపినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదిలో సంస్థలోని 2.32 లక్షల మందికి గాను.. ఏడాది చివరకు 2.27లక్షల మంది మాత్రమే ఉన్నారు. మరోవైపు ఈ ఏడాది గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో దాదాపు లక్ష మంది వరకు ఐటీ ఉద్యోగులకు కంపెనీలు లేఆఫ్ లు ప్రకటించినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళలో.. దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రకటించిన తాజా లేఆఫ్ ఐటీ రంగ కంపెనీలపై మరింత ప్రభావం చూపుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. ఐటీ ఉద్యోగుల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదని చెప్పాలి.